Election Commission Awareness Programs in Telangana: శాసనసభ ఎన్నికల సమరం కీలక అంకానికి చేరింది. నామినేషన్ల ప్రక్రియ దాదాపుగా పూర్తైంది. నేటితో ఉపసంహరణల గడువు ముగియనుంది. ఉపసంహరణల గడువు ముగిసిన అనంతరం బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించి బ్యాలెట్ పత్రాన్ని అధికారులు ఖరారు చేయనున్నారు. పార్టీలు, అభ్యర్థులు ప్రచారంలో హోరాహోరీగా తలపడనున్నారు. అధికారులు ఇక పోలింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించనున్నారు.
గత అనుభవాలు, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రతి దశ, ప్రతి ప్రక్రియను నిశితంగా గమనిస్తోంది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎక్కడా, ఎలాంటి సమస్యలు రాకుండా ఈసీ ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటోంది. ఫిర్యాదులు వచ్చినా.. ప్రతికూల సమాచారం వచ్చినా వెంటనే క్షేత్రస్థాయి నుంచి నివేదికలను అధికారులు తెలుసుకుంటున్నారు. నివేదికలు, వివరణలు నిర్ధిష్ట గడువులోగా అందేలా అధికారులను అప్రమత్తం చేసి.. వాటిపై ఆరా తీసి తగిన చర్యలు తీసుకుంటున్నారు.
ప్రలోభాలపై ఈసీ ప్రత్యేక నజర్ - గతానుభవాల దృష్ట్యా పకడ్బందీ చర్యలు
ఈసీ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో అధికారులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. చాలా వరకు పార్టీలు, అభ్యర్థులు తమ ఫిర్యాదులను వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా నేరుగా ఈసీకి కూడా పంపుతున్నారు. వాటిపై నిర్ధిష్ట గడువులోగా స్పందించాలని ఈసీ స్పష్టమైన ఆదేశాలు(EC Orders to Officials) జారీ చేసింది. రాష్ట్ర అధికారులు కూడా ఎన్నికల నిర్వహణా ప్రక్రియలో తప్పులు లేకుండా వీలైనంత మేర జాగ్రత్తలు తీసుకుంటున్నారు.