Election Code Inspection in Telangana : రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున..పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా భారీగా సొత్తును స్వాధీనం చేసుకుంటున్నారు. కానీ పట్టుకున్న సొత్తును వదిలేయాలంటూ వస్తున్న పైరవీలు పోలీసు అధికారులకు.. క్షేత్రస్థాయి సిబ్బందికి కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నాయి. కొందరు రాజకీయ నాయకులతో పాటు కొన్ని సందర్భాల్లో పలువురు ఇతర అధికారులు కూడా జోక్యం చేసుకుంటున్నారు. ఫలానా వ్యక్తి.. తమకు తెలిసిన వాడని, పట్టుకున్న సొత్తును వదిలేయాలంటూ.. తనిఖీలు నిర్వహించే అధికారులకు ఒత్తిళ్లు తెస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక పోలీసులు, తనిఖీల సిబ్బంది తలలు బాదుకుంటున్నారు.
కొందరు అధికారులైతే పైనుంచి వచ్చే ఒత్తిళ్లను తట్టుకులేక తమ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఎవరైనా ప్రముఖులకు సంబంధించిన నగదు పట్టుబడిందని తెలిసిన వెంటనే.. ఎవరు తమకు ఫోన్ చేస్తారన్న దానితో వెంటనే కొంతసేపటి వరకూ అజ్ఞాతంలోకి వెళ్లినంత పని చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు చేపడుతున్న తనిఖీల్లో పెద్దఎత్తుల నగదు పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 9వ తేదీ నుంచి శనివారం నాటికి రూ.300 కోట్లకుపైగా.. నగదు, బంగారం, మద్యం, మత్తుమందులు వంటివి స్వాధీనం చేసుకున్నారు.
Political Leaders Recommendations on Seized Money : కాగాఎన్నికల కోడ్ నిబంధనల్ని తనిఖీలను పోలీసుశాఖ సవాల్‌గా తీసుకుంది. ఒక విధంగా చెప్పాలంటే సొత్తు స్వాధీనానికి సంబంధించి పోలీస్స్టేన్ల మధ్య పోటీ నెలకొంది. ప్రత్యేకంగా తనిఖీల కోసం చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. కాగా ఇప్పటి వరకూ రాజకీయ నాయకులకు సంబంధించి డబ్బు, బంగారం.. మొదలైనని ఎక్కడా నిర్ధారణ కాలేదు. చాలావరకూ తనిఖీల్లో వ్యాపారులు, సామాన్యులతోపాటు కొంతమంది హవాల వ్యాపారులకు సంబంధించి నగదు పట్టుబడుతోంది. దోరికిన నగదుకు సరైన పత్రాలు లేకపోవడం వల్ల వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. ఒకవేళ ఏవైనా పత్రాలు చూపించిన సొత్తు ఒక దగ్గర నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లేటప్పుడు ఎలక్షన్ కమీషన్ రూపొందిన యాప్‌లో ముందుగానే నమోదు చేసుకోవాలని. అలా చేసుకోలేదు కాబట్టి నగదును స్వాధీనం చేసుకుంటున్నామని పోలీసులు చెబుతున్నారు.