ఏర్పాట్లు పూర్తి....
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల్లో సోమవారం నుంచి నామపత్రాలు స్వీకరిస్తారు. ఈ నెల 25 వరకూ అవకాశం ఉంది. అభ్యర్థుల కోసం కలెక్టరేట్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలు పొందవచ్చు. దాఖలు సమయంలో అభ్యర్థితో పాటు ఐదుగురినే లోనికి అనుమతిస్తారు. మిగతా వారంతా కార్యాలయం బయటే ఆగిపోవాలి. మొత్తం నామినేషన్ల ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారులు తెలిపారు.
ప్రచారాల పండుగొచ్చేసిందోచ్
రాష్ట్రంలో ఎన్నికల వేడి... ఎండల వేడి ఒక్కసారే మొదలైంది. ఓ వైపు భానుడు దంచికొడుతుంటే.. మరోవైపు పార్టీల ప్రచారం జోరందుకుంటోంది. నేడు నోటిఫికేషన్ విడుదలతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటి నుంచి వచ్చేనెల 9 వరకు తమ ప్రచారాలు, వాగ్దానాలతో.. వడగాలుల్లా కాకుండా.. శీతల పవనాల్లా నేతలు... ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించనున్నారు.
ముహూర్తాలే ముఖ్యం..
ఇక సెంటిమెంట్లు ఎక్కువగా ఉండే రాజకీయ నేతలు... ముహూర్తాలు చూడందే ఏ పనీ చేయరు. అందులోనూ అతి ముఖ్యమైన నామపత్రాల దాఖలు కోసం బలమైన ముహూర్తం చూడకుండా ఉండే ప్రసక్తే లేదు. టిక్కెట్లు ఖరారైన అభ్యర్థులు, తమకే టిక్కెట్లు వస్తాయని ధీమాగా ఉన్న వారు కూడా మంచిరోజు కోసం ఇప్పటికే తమకు పరిచయం ఉన్న సిద్ధాంతులను, పండితులను సంప్రదించే పనిలో పడ్డారు. ఈ సమయంలో వారికి కూడా డిమాండ్ బాగా ఉంటోంది.
మొదటి దశలోనే రాష్ట్రంలో ఎన్నికలు రావడం.. సమయం తక్కువగా ఉన్నందున.. ఓ వైపు నామినేషన్ల ఘట్టం జరుగుతుండగానే... నేతల ప్రచారాలు జోరందుకోనున్నాయి. మొత్తానికి ఓ వైపు ఎండల వేడి...మరోవైపు ఎన్నికల వేడి రాష్ట్రాన్ని గట్టిగానే తాకనుంది.
ఇవీ చూడండి:16 సీట్లను గెలిపిస్తే 160 మందిని జమచేస్తాం