తెలంగాణ

telangana

ETV Bharat / state

అసెంబ్లీ ఎన్నికల బరిలో నువ్వా, నేనా సై - వినూత్న పద్ధతుల్లో ఓట్ల వేట - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023

Election Campaign Josh in Telangana : అసెంబ్లీ ఎన్నికల బరిలో రాజకీయ పార్టీలు నువ్వా, నేనా అన్నట్లుగా గిరిగీసి కొట్లాడుతున్నాయి. గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇంటింటికి తిరుగుతున్న అభ్యర్థులు.. వినూత్న పద్ధతుల్లో ఓట్లవేట సాగిస్తున్నారు. మూడోమారు అధికారం పీఠం ఎక్కేలా కారు జోరు పెంచింది. ఒక్క అవకాశం ఇస్తే ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామంటూ హస్తం నేతలు గడగడపకు తిరుగుతున్నారు. బీసీ ముఖ్యమంత్రి అస్త్రాన్ని తెరపైకి తెచ్చిన బీజేపీ సైతం సమరానికి సై అంటోంది.

Assembly Election 2023
Election Campaign Josh in Telangana

By ETV Bharat Telangana Team

Published : Nov 10, 2023, 8:42 PM IST

Election Campaign Josh in Telangana : ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించిన అధికార బీఆర్ఎస్.. ఎన్నికల ప్రచారంలోనూ అదే దూకుడు కనబరుస్తోంది. హైదరాబాద్‌ కూకట్‌పల్లి డివిజన్‌లోని పలు కాలనీల అసోసియేషన్‌ సభ్యులతో మాధవరం కృష్ణారావు ఆత్మీయ సమ్మేళనం(Spiritual Meeting) నిర్వహించారు. ఎల్​బీనగర్‌ పరిధిలోని చైతన్యపురి డివిజన్‌లో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి గడప గడపకూ ప్రచారం నిర్వహించారు. ఇబ్రహీంపట్నం అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి స్వగ్రామంలో ఆయన కుమార్తె, కోడలు ఓట్లు అభ్యర్థించారు.

BRS Election Campaign 2023 :మెదక్‌లో పద్మాదేవేందర్‌ రెడ్డి వినూత్నంగా ఓట్లడిగారు(Votes). పట్టణంలోని శ్రీవెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పద్మా దేవేందర్‌రెడ్డి ప్రచారంలో భాగంగా బట్టలు కుడుతూ, ఇస్త్రీ చేస్తూ, ఓ హోటల్‌లో పూరీలు చేస్తూ ప్రజలను ఆకట్టుకున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పార్టీ శ్రేణులతో కలిసి వొడితెల సతీశ్‌ కుమార్‌ ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకే ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. జయశంకర్‌ జిల్లా భూపాలపల్లిలో అభ్యర్థి గండ్ర వెంకటరమణా రెడ్డి మహిళలతో కలిసి నృత్యం, కోలాటం ఆడారు.

చివరి నిమిషంలో తారుమారు - ఆశ రేపారు, అంతలోనే ఉసూరుమనిపించారు

వరంగల్‌ జిల్లా వర్ధన్నపేటలో అరూరి రమేశ్‌ విస్తృతంగా పర్యటించి బీఆర్ఎస్ మేనిఫెస్టోను వివరించారు. హనుమకొండ జిల్లా వేలేరు మండలంలోని పలు గ్రామాల్లో గులాబీ కార్యకర్తలతో కడియం శ్రీహరి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల(Govt Junior College) మైదానంలోని వాకర్లతో కలిసి నల్లమోతు భాస్కర్‌ రావు ప్రచారం నిర్వహించారు. గుర్రంపోడు మండలంలో నోముల భగత్‌, త్రిపురారం మండలంలో ఆయన సతీమణి ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు.

Congress Election Campaign in Telangana 2023 :ఆరు గ్యారంటీలతో జోరు మీదున్న హస్తంపార్టీ ఓటర్లను ఆకట్టుకునేందుకు కొత్త వ్యూహాలు అనుసరిస్తోంది. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌ నుంచి పోటీలోకి దిగుతున్న అంజన్‌కుమార్‌ యాదవ్‌ శివాలయం వీధి, బాపూజీనగర్‌ తదితర కాలనీల్లో ఇంటింటికి తిరుగుతూ గ్యారంటీ కరపత్రాలు(Guarantee Leaflets) పంచారు. ఓల్డ్‌ బోయిన్‌పల్లి పరిధిలో కూకట్‌పల్లి అభ్యర్థి బండి రమేశ్‌ ఓట్లు అభ్యర్థించారు.

మంచిర్యాల జిల్లాలోని మాజీ ఎంపీ వివేక్‌ నివాసంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థులు వినోద్‌, ప్రేమ్‌సాగర్‌, వివేక్‌ మీడియా సమావేశం నిర్వహించి కేసీఆర్(CM KCR) పార్టీ​పై విమర్శలు గుప్పించారు. హుస్నాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో వొడితెల సతీశ్‌ కుమార్‌ వైఫల్యాలపై పొన్నం ప్రభాకర్‌ ఛార్జీషీట్‌ విడుదల చేశారు. మునుగోడులో పలువురు బీఆర్ఎస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, మున్సిపల్‌ ఛైర్మన్‌లు కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు.

BJP Election Campaign Josh in Telangana : బీసీ మంత్రంతో కాషాయదళం పోరు బరిలో దూసుకుపోతోంది. ముషీరాబాద్‌ నియోజకవర్గ అభ్యర్థి పూసరాజుకు మద్దతుగా శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో జనసేన అభ్యర్థి సతీశ్‌ రెడ్డిని గెలిపించాలని కేంద్ర ఐటీ సహాయ మంత్రి రాజీవ్‌చంద్ర శేఖర్‌ విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్‌లోని 21వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి దన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా మోదీ(PM Narendra Modi), అమిత్‌షాఫ్లకార్డులతో ఓటర్లను ఆకట్టుకున్నారు.

MIM Election Campaign in Hyderabad :హైదరాబాద్‌ పాతబస్తీ చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో అక్బరుద్దీన్‌ ఒవైసీతో కలిసి ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌(Asaduddin Owaisi)ప్రచారం నిర్వహించారు. టోలిచౌకిలోని న్యూహకీంపేట్‌లో కార్వాన్‌ అభ్యర్థి కౌసర్‌మొయినుద్ధీన్‌ పాదయాత్ర నిర్వహించగా స్థానికులు ఘన స్వాగతం పలికారు

అసెంబ్లీ ఎన్నికల బరిలో నువ్వా, నేనా-వినూత్న పద్ధతుల్లో ఓట్లవేట

చివరి నిమిషంలో అభ్యర్థులను మార్చిన బీజేపీ - కంటతడి పెట్టుకున్న నేతలు

ABOUT THE AUTHOR

...view details