బల్లాలేశ్వరుడు
పుణెకి 100 కిలో మీటర్ల దూరాన పాలి క్షేత్రంలో వెలసిన స్వామి బల్లాలేశ్వరుడు అంటే బాలగణపతి అనుకోవచ్చు. అష్ట క్షేత్రాల్లోనూ ఒక భక్తుడి పేరిట వెలసిన స్వామి ఈయనే. బల్లాల్ అనే పరమ భక్తుడి భక్తికి మెచ్చి ప్రత్యక్షమైన గణపతి అతని పేరుతోనే ఈ గ్రామంలో వెలిశాడని స్థలపురాణం. తూర్పముఖంగా వెలసిన బల్లాలేశ్వరుడి విగ్రహంపై దక్షిణాయన కాలంలో సూర్యకిరణాలు పడటం ఇక్కడి ప్రత్యేకత.
వరద వినాయకుడు
మహడ్ క్షేత్రంలో స్వామి వరద వినాయకుడు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రుక్మాంగదుడనే మహారాజు వాచక్నవి అనే రుషి దర్శనార్థం ఈ గ్రామానికి వచ్చాడట. రాజు వైభోగాన్ని కళ్లారా చూసిన రుషిపత్ని ముకుంద అతనిపై మనసు పడింది. రాజు అందుకు ఒప్పుకోకుండా అక్కణ్నుంచి వెళ్లిపోగా అదే అదనుగా ఇంద్రుడు రుక్మాంగదుడి రూపంలో ముకుంద దగ్గరికి వచ్చాడట. ఆ ఆ కలయిక వల్ల గృత్సమధుడు అనే పిల్లవాడు పుట్టాడు. పెరిగి పెద్దయ్యాక తన పుట్టుక రహస్యం తెలుసుకున్న ఆ కుర్రవాడు.. అందరి పాపాలూ తొలగిపోవాలని వినాయకుణ్ని ప్రార్థించాడట. ఆ పిల్లవాడి భక్తికి మెచ్చిన గణనాథుడు ప్రత్యక్షమై కోరిన వరాన్ని ఇచ్చి అక్కడే స్వయంభువుగా వెలిసి వరద వినాయకుడిగా సుప్రసిద్ధుడయ్యాడట. ఈ స్వామి ఆలయంలో గర్భగుడిలోని దీపం గత వందేళ్లుగా అఖండంగా వెలుగుతోందని చెబుతారు స్థానికులు.
చింతామణి గణపతి
షోలాపూర్ పుణె మార్గంలో ఉండే థేవూర్ క్షేత్రంలో స్వామి చింతామణి గణపతిగా పూజలందుకుంటున్నాడు. పూర్వం కపిల మహాముని వద్ద కోరిన కోర్కెలు తీర్చే ‘చింతామణి’ అనే రత్నం ఉండేదట. ఒకసారి ఆ ప్రాంతాన్ని పాలించే అభిజిత మహారాజు కొడుకైన గణరాజు.. కపిల మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. చింతామణి సాయంతో యువరాజుకూ అతని పరివారానికీ అప్పటికప్పుడు విందు సిద్ధం చేశాడట ఆ మహర్షి. ఆ వింతకు ఆశ్చర్యపోయిన యువరాజు కపిలమహామునిని ఏమార్చి చింతామణిని అపహరించాడు. అప్పుడు కపిలుడు వినాయకుని ప్రార్థించి ఆ మణిని తిరిగి పొందాడనీ.. గణరాజును చంపి ఆ మణిని తెచ్చిచ్చిన గణపతి ‘చింతామణి గణపతి’గా ప్రసిద్ధి చెందాడనీ స్థలపురాణం. ఆ యుద్ధం ఒక కబంధ వృక్షం వద్ద జరగడం వల్ల ఈ వూరిని కబంధతీర్థం అని కూడా అంటారు.
మయూరేశ్వరుడు
పుణె జిల్లా బారామతి తాలూకాలోని మోర్‌గావ్ గ్రామంలో వెలసిన వినాయకుడు మూషికవాహనంపై కాకుండా మయూరాన్ని ఆసనంగా చేసుకోనివుండటం ఈ క్షేత్ర ప్రత్యేకత. తన తమ్ముడు సుబ్రహ్మణ్యేశ్వరుడి వాహనమైన మయూరాన్ని అధిష్ఠించి ఉంటాడు. ఆ కథేంటంటే.. ఒకప్పుడు సింధురాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రాంత ప్రజలను తీవ్రంగా హింసించేవాడట. దీంతో మునులు దేవతలను వేడుకోగా వినాయకుడు తన తమ్ముడి వాహనాన్ని అధివసించి భువికి దిగివచ్చి ఆ రాక్షసుణ్ని మట్టుబెట్టాడట. అందుకే ఈ గణేశుణ్ని మయూరేశ్వరుడు, మోరేష్, మోరేశ్వర్ అని పిలుస్తారు. అసురసంహారం గావించిన స్వామి కాబట్టి.. ఈ క్షేత్రంలో వినాయక చవితితోపాటు విజయదశమి వేడుకలను కూడా అత్యంత వైభవంగా జరిపిస్తారు.
సిద్ధి వినాయకుడు
పూర్వం మధుకైటభులనే రాక్షసులతో శ్రీ మహావిష్ణువు యుద్ధం చేస్తూ వినాయకుడి సాయం అర్థించాడట. శ్రీహరి అభ్యర్థన మేరకు రణరంగాన ప్రత్యక్షమయ్యాడట గణపతి. ఆ స్వామి దర్శనంతో విష్ణుమూర్తి రెట్టించిన బలం, వేగం, ఉత్సహాలతో రాక్షసులను మట్టుబెట్టాడు. వినాయకుడి వరం వలన కార్యసిద్ధి కావడంతో ఈ ప్రాంతం సిద్ధక్షేత్రం అయింది. వినాయకుడి సహకారానికి సంతోషించిన విష్ణుమూర్తి తానే స్వయంగా ఈ క్షేత్రంలో ఆలయాన్ని నిర్మించి గణపతిని ప్రతిష్ఠించాడట. ఈ ఆలయం ఎత్తైన కొండపై ఉంటుంది. స్వయంభువుగా భావించే స్వామి విగ్రహానికి ఇరువైపులా సిద్ధి, బుద్ధి దేవతలున్నారు. మిగతా క్షేత్రాల్లోని విగ్రహాలకు భిన్నంగా ఇక్కడ స్వామి వారి తొండం కుడివైపునకు తిరిగి ఉంటుంది.
మహాగణపతి