- హైదరాబాద్ ఉప్పల్‌లో నివసిస్తున్న ఓ కుటుంబంలో ఇటీవల పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఆ వేడుకలకు హాజరైన ఒకరిలో ముందుగా కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. ఈ కుటుంబం మొత్తం కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకుంది. వీరిలో తొలిరోజు ఒకరిలో కరోనా నిర్ధారణ కాగా.. 2 రోజుల్లోనే ఆ కుటుంబంలోని మిగిలిన ముగ్గురికి పాజిటివ్‌గా తేలింది. ఇప్పుడా కుటుంబమంతా హోం ఐసొలేషన్‌లో ఉన్నారు.
- వరంగల్‌కు చెందిన ఒక ప్రైవేటు ఉద్యోగి (45) కుటుంబంలో ముందుగా ఏడేళ్ల చిన్నారికి స్వల్ప జ్వరం, జలుబు చేసింది. సాధారణ జ్వరమేననుకొని మందులు వేశారు. పాపకు తగ్గింది గానీ.. ఇంట్లో మిగిలిన నలుగురు కుటుంబ సభ్యులకూ వరుసగా మూడూ రోజుల వ్యవధిలోనే జ్వరమొచ్చింది. ఒళ్లునొప్పులు, తలనొప్పి కూడా వేధిస్తుండడంతో.. పాప సహా ఇంటిల్లిపాదికి కొవిడ్ పరీక్షలు చేయించారు. కుటుంబ సభ్యులందరికీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆ ఉద్యోగికి, వారి అమ్మ(72)కు అధిక రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక జబ్బులుండడంతో.. ఆసుపత్రిలో చేరారు.
మన దేశంలో సుమారు 800 రకాల వైరస్ ఉత్పరివర్తనాలున్నట్లు ఇప్పటికే పరిశోధకులు గుర్తించారు. ఇందులో కొన్ని తీవ్రంగా ఉత్పరివర్తనం చెందడం వల్ల మహమ్మారి తీవ్రంగా విరుచుకుపడుతోందని అంచనా వేస్తున్నారు. అతివేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందడానికి ఇదే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇదే అంశాన్ని ఇటీవల ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు కూడా వెల్లడించారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు కూడా. తొలిదశలో సామాజిక వ్యాప్తికి కొన్ని నెలల సమయం తీసుకోగా.. రెండోదశలో రెండుమూడు వారాల వ్యవధిలోనే సమాజంలోకి చొచ్చుకుపోయిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
కొవిడ్ నిబంధనలను పాటించకే...
ప్రజలు కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించడం వల్ల.. కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల వైరస్ వ్యాప్తి అతి వేగంగా జరుగుతున్నట్లు వైద్యవర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు, విషాద కార్యాలు, ఎన్నికల సభలు, ప్రదర్శనలు తదితర సందర్భాల్లో ప్రజలు ఇటీవలి కాలంలో గుమిగూడడం వల్ల కూడా వైరస్ ఒకరి నుంచి ఎక్కువమందికి వ్యాప్తి చెంది ఉంటుందని కూడా భావిస్తున్నారు. దీనిపై ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక విశ్లేషణాత్మక నివేదికను విడుదల చేసింది. ప్రపంచంలో 70 శాతానికిపైగా దేశాల్లో కొవిడ్ సామాజిక వ్యాప్తి దశలో ఉన్నట్లుగా పేర్కొంది. భారత్‌లో రెండోదశ ఉద్ధృతి కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. తొలిదశలో 40 జిల్లాల్లో 50 శాతం కేసులుండగా.. రెండోదశలో 20 జిల్లాల్లోనే 50 శాతం కేసులున్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్లేషించింది. తొలిదశలో 60-100 జిల్లాల్లో 75 శాతం కేసులు బయటపడగా.. రెండోదశలో కేవలం 10 రాష్ట్రాల్లోనే 80 శాతం కేసులు నమోదైనట్లుగా చెప్పింది. ప్రధానంగా మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, కేరళ రాష్ట్రాల్లో 63 శాతం పాజిటివ్‌లున్నట్లు పేర్కొంది. గత సెప్టెంబరులో కంటే ఈ ఏప్రిల్‌లో అత్యధికంగా వైరస్ బాధితులు నిర్ధారణ అయినట్లుగా తెలిపింది. రాష్ట్రంలోనూ కొవిడ్ విజృంభణ కారణంగా పడకలు లభ్యం కాని పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చే నాలుగైదు వారాలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందనీ, వైరస్ విజృంభణ పతాక స్థాయికి చేరుకునే అవకాశాలెక్కువగా ఉన్నాయని వైద్యవర్గాలు సూచిస్తున్నాయి.
ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి