ఒప్పంద సేద్యం (కాంట్రాక్టు ఫార్మింగ్) చట్టం కింద పంట సాగుచేస్తే కంపెనీలు పెట్టే ఆంక్షలకు రైతులు కట్టుబడి ఉండాల్సిందేనని కేంద్రం రూపొందించిన పత్రం స్పష్టం చేస్తోంది. పంటల మార్కెటింగ్‌కు సంబంధించి 3 బిల్లులను పార్లమెంటులో ఆమోదించిన వెంటనే వాటిని చట్టాలుగా కేంద్రం గెజిట్‌లో నోటిఫై చేసి అమల్లోకి తెచ్చింది. ఈ విధానంలో రైతు, కంపెనీకి మధ్య చేసుకునే 13 పేజీల ‘ఒప్పంద పత్రం’ నమూనాను అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖలకు తాజాగా పంపింది. కొత్త రబీ (యాసంగి) సీజన్ నుంచే ఈ పత్రం ప్రకారం ఒప్పంద సేద్యం అమలుకు కేంద్ర వ్యవసాయ శాఖ ఆదేశాలిచ్చింది.
దాని ప్రకారం.. ఒక కంపెనీతో రైతు లేదా రైతు సంఘం సేద్యం కోసం ఒకసారి ఒప్పందం చేసుకుంటే ఆ గడువు పూర్తయ్యేవరకూ అన్ని రకాలుగా అది చెప్పినట్టల్లా వినాల్సిందే. కంపెనీ రాతపూర్వకంగా అనుమతి ఇవ్వకుంటే పంటను రైతు ఇతరులకు అమ్మడానికి కూడా వీల్లేదు. కంపెనీ చెప్పినప్పుడే పంటను కోయాలి. అది పంపిన సాంకేతిక నిపుణుల సూచనల మేరకు పంటను రక్షించాలి. పెట్టుబడి మొత్తం రైతులే పెట్టుకోవాలి. పంటకు బీమా సైతం రైతు సొమ్ముతోనే చేయించాలి తదితర నిబంధనలను ఒప్పంద సేద్యంలో కేంద్రం విధించింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఒకసారి ఒక పంట సీజన్ లేదా గరిష్ఠంగా ఐదేళ్ల కాలం వరకూ ఒక కంపెనీతో ఒప్పందం చేసుకుని పంటలు సాగుచేస్తే ఇక రైతు పండించడమే తప్ప.. దాన్ని కోసి, అమ్ముకుని ధర పొందేదాకా కంపెనీదే పూర్తి ఆధిపత్యం. ఒప్పందం పూర్తయ్యేదాకా కంపెనీ చెప్పినట్లు వినాల్సిందే.
‘ఏ’ రకానికే పూచీకత్తు ధర..
పంటను కోశాక నాణ్యతను పరిశీలించి ఏ, బీ, సీ అని మూడు రకాలుగా వర్గీకరించి కంపెనీ ధరలు చెల్లిస్తుంది. ఇందులో ‘ఏ’ రకానికి మాత్రమే కనీస పూచీకత్తు ధర ఇస్తుంది. బీ, సీ రకాలకు అంతకన్నా తగ్గించి ఇచ్చే హక్కును కంపెనీకే కల్పించారు. ఒకవేళ ధరపై లేక ఇతర ఏ అంశంలోనైనా కంపెనీకి, రైతుకు వివాదం తలెత్తితే రెవెన్యూ డివిజనల్ అధికారి(ఆర్డీఓ)కి ఫిర్యాదు చేయాలి. ఆయన 30 రోజుల్లో తీర్పు చెప్పాలి. ఆ తీర్పు నచ్చకపోతే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలి. ఆయనా 30 రోజుల్లో తీర్పు చెప్పాలి. అప్పటిదాకా రైతుకు కంపెనీ సొమ్ము చెల్లించకపోయినా చేసేదేం లేదు. అంటే వివాదం తలెత్తితే 60 రోజులపాటు రైతు అధికారుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది.
ఒప్పంద పత్రంలో ఏముందంటే..?
ఒప్పంద సేద్యంలో పాటించాల్సిన పలు నిబంధనలను కేంద్రం రూపొందించిన పత్రంలో అంశాలవారీగా వివరించింది. ఈ పత్రాన్ని వ్యవసాయ శాఖ నుంచి ‘ఈనాడు- ఈటీవీ భారత్’ సేకరించింది. అందులోని ముఖ్యాంశాలు..
* రైతు, కంపెనీని ‘పార్టీ’ అనే పేరుతో ఒప్పందం రాస్తారు. ఏ తేదీ నుంచి ఒప్పందం అమల్లోకి వస్తుందనేది పత్రంలో రాయాలి.
* ఒప్పందం చేసుకునే కంపెనీ అధునాతన వ్యవసాయ పరిజ్ఞానాన్ని అందించి నాణ్యమైన పంటలను పండించేందుకు రైతులకు సాయపడాలి.
* రైతు పేరు, గ్రామం, పొలం ఉన్న సర్వే నంబరు, జిల్లా, రాష్ట్రం వివరాలన్నీ స్పష్టంగా రాయాలి.
* ఏ పంట, ఏ వంగడం సాగుచేశారో తెలపాలి. పంట కోసిన తర్వాతే కంపెనీ తీసుకోవడానికి అనుమతించాలి. పంట సాగు ప్రారంభం నుంచి కోత వరకూ రైతు, కంపెనీ కలిసి పనిచేయాలి.
* ఒక పంట సాగు సీజన్ ముగిసిన తర్వాత మరుసటి సీజన్‌కు ఒప్పందం కొనసాగించాలా వద్దా అనేది రైతు, కంపెనీ పరస్పర అంగీకారంతో మాత్రమే నిర్ణయించాలి.
* రైతు పంట సాగుచేసిన పొలం వద్దకొచ్చి ఒప్పంద కంపెనీ తీసుకెళ్లాలి. రైతుకెలాంటి రవాణా ఖర్చు ఉండొద్దు. ఏ రోజు ఏ సమయానికి పంట కోసి ఇవ్వాలో కంపెనీ ముందే రాసి ఇవ్వాలి.
* విదేశాలకు ఎగుమతి చేసే పంటలపై రసాయన అవశేషాలు పరిమితికి మించి ఉండరాదు.
* పంట సాగు ఖర్చులన్నీ రైతు పెట్టుకోవాలి. కానీ, పంట కోసేముందు ఉదాహరణకు అరటిగెలలైతే అవి పాడవకుండా పురుగుపట్టకుండా కాపాడే రక్షణ చర్యలను కంపెనీ ఖర్చులతో చేయించాలి.
* రైతు సొంత ఖర్చుతో మట్టి, సాగునీటి నమూనాలు తీసుకెళ్లి ప్రయోగశాలల్లో పరీక్షలు, పంటకు బీమా చేయించాలి.
* పంట కోత అనంతరం దాని తరలింపునకు రవాణా, శుద్ధి, నిల్వ, ఎగుమతి ఖర్చులన్నీ కంపెనీనే భరించాలి. వాటితో రైతులకు సంబంధం లేదు.
* నాణ్యమైన పంట దిగుబడి వచ్చేందుకు కంపెనీ సాంకేతిక నిపుణులను పొలం వద్దకు పంపి రైతుకు సూచనలిప్పించాలి.
* ప్రభుత్వ పథకాల నుంచి రాయితీలు పొందేలా రైతులకు కంపెనీ సాయపడాలి. పంట కోసిన తర్వాత పాడైతే రైతుకు సంబంధం లేదు.
* పంటను ఏ ధరకు కొంటారో ముందే ‘కనీస పూచీకత్తు ధర’ (మినిమమ్ గ్యారెంటెడ్ ప్రైస్) పేరుతో తెలపాలి. పంటను అమ్మే సమయంలో అంతకన్నా ఎక్కువ ధర మార్కెట్‌లో ఉంటే ఆ మేర కొంత శాతం అదనంగా పెంచి రైతుకు కంపెనీ చెల్లించాలి.
* పంటను కొన్న వెంటనే రైతుకు సొమ్ము చెల్లించాలి. రైతు ఆధార్, బ్యాంకు ఖాతా, చెక్ నమూనా, బ్యాంకు వివరాలు ముందే కంపెనీ తీసుకోవాలి.
* కంపెనీ అందించే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వివరాలను ఇతరులకు రైతు వెల్లడించరాదు.
* ఒకసారి ఒప్పందం చేసుకున్న తర్వాత కంపెనీ రాతపూర్వక అనుమతి లేకుండా పంటను రైతు ఇతరులకు అమ్మడానికి వీల్లేదు.
* రైతు భూమిపై కంపెనీకి ఎలాంటి హక్కు ఉండదు. కేవలం పంటపైనే ఉంటుంది.
ఇదీ చదవండి:80ఏళ్ల వయసులో బామ్మ సేద్యం... కౌలు భూమిలో ప్రకృతి వ్యవసాయం