భవిష్యత్తు కార్యాచరణపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Eetala rajender) మూడు రోజుల్లో ప్రకటన చేయనున్నట్లు సమాచారం. భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా(Jp nadda)ను సోమవారం కలిసిన ఈటల మంగళవారం దిల్లీలోనే ఉండిపోయారు. ఈటల, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ ఛుగ్ దిల్లీలో మంగళవారం గంటన్నరకుపైగా చర్చలు జరిపారు.
రాజీనామా!
తొలుత శాసన సభ్యత్వానికి, తెరాసకు రాజీనామా చేయాలని ఈటల నిర్ణయించుకున్నట్లు తెలిసింది. నియోజకవర్గానికి వెళ్లి మరోసారి నాయకులు, ముఖ్య కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈటలతో పాటు ఏనుగు రవీందర్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తారని తెలిసింది. మంగళవారం నాటి చర్చల్లో వివిధ జిల్లాల్లో తెరాస అసంతృప్తులు ఎవరు? వారిలో వెంటనే పార్టీ వీడేవారు ఎవరు? వారితో ఆయా నియోజకవర్గాలు, జిల్లాల్లో కలిగే ప్రయోజనం ఎంత అనే అంశాలను చర్చించినట్లు తెలిసింది.