కేరళ బాధితులకు ఈనాడు ఇళ్లు అవి ఇళ్లు మాత్రమే కాదు..! వేలాది మంది మానవతావాదుల మంచితనానికి...నిలువెత్తు సాక్ష్యాలు. ఆశ్రయం కోసం ఎదురు చూస్తున్న వారి కళ్లల్లో ఆనందం నింపే జీవితకాలపు గుర్తులు. రామోజీ గ్రూపు సామాజిక బాధ్యతకు మచ్చు తునకలు. అసలింతకీ ఎక్కడవీ ఆ ఇళ్లు..! ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఏడాదిన్నర వెనక్కి వెళ్లాల్సిందే...!
వరదలతో కకావికలం
కేరళ..! ప్రకృతి అందాలకు నెలవు. జీవితంలో ఒక్కసారైనా సందర్శించి తీరాలని ప్రతి పర్యాటక ప్రేమికుడు కోరుకునే ప్రదేశం. అందమైన సెలయేళ్లు. ఆ నీటిపై పడి ప్రతిబింబించే సూర్యకిరణాల కాంతి. తీరాలను కాచుకునే పొడవాటి కొబ్బరిచెట్లు. నోరూరించే ప్రత్యేకమైన వంటకాలు. సనాతన సంప్రదాయాలు. విభిన్నమైన జీవన శైలి. ఇలా మలబారు తీరంలో అన్నీ ప్రత్యేకతలే. అంతటి అందమైన జీవన విధానాన్ని 2018 ఆగష్టులో వచ్చిన వరదలు కకావికలం చేశాయి.
దిక్కుతోచని స్థితిలో అలప్పుజ వాసులు
ప్రభుత్వం, అధికారుల సమర్థమైన పనితీరుతో ప్రాణగండం తప్పించుకున్న కేరళ వాసులు నిలువ నీడ లేకుండా పోయారు. కట్టుబట్టలతో పునరావాస కేంద్రాల్లో బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన దుస్థితి. ప్రత్యేకించి కేరళ పర్యటకానికే తలమానికంగా నిలిచే అలప్పుజ ప్రాంతం మరింత దెబ్బతింది. పూర్తిగా పర్యాటక రంగంపైనే ఆధారపడి జీవించే ఇక్కడి ప్రజలు...ఆ వరదల తర్వాత దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నారు.
పడవలే వారి ఆధారం
దక్షిణభారత దేశంలోనే పర్యటకం నుంచి అత్యంత ఆదాయం ఆర్జించే ప్రాంతంగా అలప్పుజకు పేరుంది. ముఖ్యంగా అక్కడ బోట్ హౌస్‌లు, జలరవాణా కోసం నడిపే పడవల పైనే ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తున్నారు. వరదల వల్ల వీరంతా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
ఆ నిర్ణయం నింపింది వారిలో ఆనందం
ఇప్పటి వరకు ఇరుకైన ఇళ్లల్లోనే బతుకు వెళ్లదీస్తూ వచ్చారు...బాధితులు. ఒకరి నుంచి సాయం ఆశించటమే మానేసి..తమ పని తాము చేసుకుంటున్న తరుణంలో...వారిని సంతోషపరిచే సమాచారం అందింది. అదే...రామోజీ గ్రూప్...తమకు ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న సంకల్పంతో ఉందన్న శుభవార్త. అప్పటి వరకు నిర్వేదంలో, నిరాశలో ఉన్న వారిలో ఎక్కడలేని ఆనందం నిండింది.అలప్పుజ జిల్లాలో నిరాశ్రయులైన వారందరికీ నిలువ నీడ కల్పించాలన్న సదుద్దేశంతో ఇళ్లు కట్టించే కార్యక్రమం చేపట్టింది...రామోజీ గ్రూప్. కేరళలోని అతిపెద్ద మహిళా సహాయక సంఘం కుటుంబశ్రీతో గతేడాది మార్చిలో ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం 116 ఇళ్లు కట్టించి ఇవ్వాలన్నది అందులోని సారాంశం. గతేడాది మార్చి నెలలోనే ప్రారంభమైన ఇళ్ల నిర్మాణం... డిసెంబర్ నాటికి ముగిసింది.
అయ్యారు ఇంటి యాజమానులు
నిన్న మొన్నటి వరకు చాలీచాలని గదుల్లో జీవనం సాగించిన వీరంతా ఇప్పుడు రెండు పడక గదుల ఇళ్లకు సొంతదారులయ్యారు. రామోజీ గ్రూప్ అనుకున్న లక్ష్యం పూర్తి చేయటంలో అక్కడి అధికారులు కూడా ఎంతో సహకరించారు. ఎప్పటికప్పుడు ఇళ్ల నిర్మాణాన్ని సమీక్షిస్తూ... అవసరమైన సలహాలు ఇస్తూ ఇలా వాటిని సౌకర్యంగా, ఆవాసయోగ్యంగా మలిచారు.
సంకల్పం మంచిదైతే సరిపోదు. అందుకు తగిన విధంగా కృషి చేయటం ఎంతో అవసరం. ఈ విషయంలో రామోజీ గ్రూపు ఏర్పాటు చేసిన ఈనాడు సహాయ నిధి పూర్తి స్థాయిలో విజయం సాధించిందనటానికి...ఈ ఇళ్లే నిదర్శనాలు.
ఇదీ చూడండి:కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద ఐదుగురు!