మొక్కలు ప్రాణవాయువు అందించడమేగాక, కాలుష్యాన్ని నివారించడంలో కీలకపాత్ర పోషిస్తాయని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈనాడు-ఈటీవీ చేపట్టిన మొక్కల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ ఉద్యాన విభాగం సౌజన్యంతో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్ కట్టమైసమ్మ ఆలయం వద్ద మొక్కలు పంపిణీ చేశారు. బోనాల వేడుకల్లో పాల్గొన్న భక్తులకు 10 వేల మొక్కలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ పొల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా.. ఐదేళ్లుగా మొక్కలు పంచుతున్న ఈనాడు, ఈటీవి బృందాన్ని.. ఎమ్మెల్యే అభినందించారు. పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు.
50 వేల మొక్కల పంపిణీ
ఇప్పటి వరకు 50వేల మొక్కలను పంపిణీ చేసినట్లు... ముషీరాబాద్ జోన్ ఈనాడు ప్రతినిధులు తెలిపారు. ఉదయం 10గంటలకు ప్రారంభమైన మొక్కల పంపిణీ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. కట్టమైసమ్మ ఆలయంలో బోనాలు సమర్పించిన భక్తులు అనంతరం ఈనాడు-ఈటీవి ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్న మొక్కలను సంతోషంగా స్వీకరించి ఇంటికి తీసుకెళ్లారు. గత ఐదేళ్లుగా ఈనాడు ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కొనసాగుతుందని ఈనాడు ప్రతినిధులు తెలిపారు. పలువురు స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, వివిధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు, గృహిణులకు, విద్యార్థులకు మొక్కలను అందజేశారు.