ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఇవాళ ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్ పాటిస్తున్నాయి. ఎయిడెడ్ కళాశాల విలీన నిర్ణయాన్ని విరమించుకోవాలని ఆందోళన చేస్తున్న ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడానికి నిరసనగా విద్యార్థి సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. ఎస్ఎస్‌బీఎన్ కళాశాల యాజమాన్యం 2 రోజులు సెలవు ప్రకటించింది.
అసలేం జరిగింది..
ఎయిడెడ్ కళాశాల విలీన నిర్ణయాన్ని విరమించుకోవాలని విద్యార్థుల ఆందోళన.. వారిని అరెస్టు చేసేందుకు పోలీసుల ప్రయత్నం.. విద్యార్థుల ప్రతిఘటన.. పోలీసులు లాఠీలు ఝుళిపించడంతో అనంతపురంలోని ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల ఆవరణ రణరంగమైంది. ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాల నాయకులు, వందల మంది విద్యార్థులు అనంతపురంలోని ఎస్‌ఎస్‌బీఎన్ (శ్రీసాయిబాబా నేషనల్) కళాశాల వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. కళాశాలను ప్రైవేటీకరించకుండా ఎయిడెడ్‌గానే కొనసాగించాలని నినాదాలు చేశారు. పోలీసులు వచ్చి ఆందోళన చేస్తున్న ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. నాయకులను అరెస్టు చేసి తీసుకెళ్లకుండా విద్యార్థులు కళాశాల ప్రధాన ద్వారాన్ని మూసివేశారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. అడ్డుకున్నవారిని లాగిపడేశారు. జెండా కర్రలు తీసుకొని చితక్కొట్టారు. దీంతో కొందరు విద్యార్థులు గుంపులో నుంచి రాళ్లు విసిరారు. ఈ ఘటనలో జయలక్ష్మి అనే విద్యార్థిని గాయపడింది. విద్యార్థులు ప్రతిఘటించడంతో ఆగ్రహించిన పోలీసులు వారిని చొక్కాలు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. విద్యార్థినులనూ పురుష కానిస్టేబుళ్లే పక్కకు నెట్టేశారు. ఎట్టకేలకు విద్యార్థిసంఘాల నాయకులను అరెస్టు చేసి స్టేషనుకు తరలించడంతో పరిస్థితి అదుపులోకొచ్చింది.