Sabitha review on corona cases in school: విద్యాసంస్థల్లో కొవిడ్ కలకలంపై ఆశాఖ అప్రమత్తమైంది. కరోనా విస్తృతిపై జాగ్రత్తగా ఉండాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. కొన్నిచోట్ల యాజమాన్యాల నిర్లక్ష్యం కనిపిస్తోందని అన్నారు. పాఠశాలలు, వసతిగృహాల్లో కరోనా పరిస్థితులపై శాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. కొన్ని విద్యాసంస్థల్లో కొవిడ్ కేసులు నమోదవుతున్నాయన్న మంత్రి.....విద్యార్థులందరికీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
జాగ్రత్తలు అవసరం
school corona cases: పాఠశాలల్లో విద్యార్థులు కొవిడ్ నిబంధనలు పాటించేలా... మాస్కు తప్పక ధరించేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తరగతి గదుల్లో భౌతిక దూరం పాటించాలని... వసతిగృహాలు, గురుకులాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సిబ్బంది తప్పనిసరిగా రెండు డోసులు తీసుకోవాలని నిర్దేశించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు భయపడాల్సిన పనిలేదన్న మంత్రి... శానిటైజర్లు, థర్మల్ స్క్రీనింగ్ మిషన్లు తప్పక వాడాలని ఆదేశించారు.
గురుకులాల్లో పెరుగుతున్న కేసులు
Muthangi gurukul school Covid-19 Cases : సంగారెడ్డి జిల్లా ముత్తంగి గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేగింది. ఆదివారం 42 మంది విద్యార్థులు, ఉపాధ్యాయురాలికి వైరస్ నిర్ధరణకాగా... సోమవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో మరో ఐదుగురు విద్యార్థులకు పాజిటివ్‌గా తేలింది. ఫలితంగా మొత్తం కరోనా బాధితుల సంఖ్య 48కి చేరింది. పాఠశాలలో విద్యార్థులందరికీ నిర్ధరణ పరీక్షలు పూర్తయినట్లు వైద్యశాఖ సిబ్బంది తెలిపారు.