పాఠశాలల నిర్వహణలో కొవిడ్ మార్గదర్శకాల అమలులో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడవద్దని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. అవసరమైతే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో షిఫ్టు విధానాన్ని పాటించవచ్చని మంత్రి తెలిపారు. తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని... కచ్చితంగా ప్రత్యక్ష తరగతులకు హాజరుకావాలని విద్యార్థులపై ఒత్తిడి చేయవద్దని పాఠశాల యాజమాన్యాలకు సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.
వారికి ఆన్లైన్ బోధన...
ప్రత్యక్ష తరగతులకు హాజరు కాని విద్యార్థుల కోసం ఆన్లైన్ బోధన కొనసాగించాలన్నారు. రేపటి నుంచి ఆరు, ఏడు, ఎనిమిది తరగతులు ప్రారంభం కానున్నందున విద్యా శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి చిత్ర రామచంద్రన్, పాఠశాల విద్యా శాఖ సంచాలకురాలు శ్రీదేవసేన, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. స్థానిక పరిస్థితుల ఆధారంగా రేపటి నుంచి మార్చి 1 వరకు ప్రారంభించుకోవచ్చని మంత్రి సూచించారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని మంత్రి కోరారు.