Telangana Inter Exams: విద్యాశాఖ అధికారులతో మంత్రి సమీక్ష... 25 నుంచి ఇంటర్ పరీక్షలు - Telangana Inter Exams 2021

11:53 October 21
ఇంటర్ పరీక్షలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష
ఈ నెల 25 నుంచి ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita Indrareddy ) పేర్కొన్నారు. ఇంటర్ పరీక్షలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. జిల్లా ఇంటర్ విద్యాధికారులతో మంత్రి సబిత టెలీకాన్ఫరెన్స్‌లో ఇంటర్ పరీక్షలపై చర్చించారు. ప్రమోట్ చేసిన విద్యార్థులకు పరీక్షలు పెడుతున్నామని మంత్రి సబిత తెలిపారు. 4.50 లక్షలపైగా విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారన్నారు. జిల్లా స్థాయిలో అన్ని శాఖలతో సమన్వయం చేసుకున్నట్లు వివరించారు.
పరీక్షా కేంద్రాలను 1750కి పెంచామని పేర్కొన్నారు. 25 వేలమంది ఇన్విజిలేటర్లు పాల్గొంటున్నారని చెప్పారు. పరీక్ష కేంద్రంలో ఐసోలేషన్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. గంట ముందు వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణకు ప్రైవేట్ యాజమాన్యాలు సహకరించాలని సూచించారు. పరీక్షల సమయంలో ఇబ్బందులు పెట్టొద్దని అన్నారు.
ఇప్పటికే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల హాల్ టికెట్లు నేటి నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఆ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. వెబ్ సైట్లో అప్లోడ్ చేశామని.. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 25 నుంచి నవంబరు 3 వరకు ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతున్న ఇంటర్ విద్యార్థులకు మొదటి సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. హాల్ టికెట్లో వివరాలు తప్పు ఉంటే కళాశాల ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. హాల్ టికెట్‌పై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా పరీక్షకు అనుమతి ఇవ్వాలని చీఫ్ సూపరింటెండెంట్లకు ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ స్పష్టం చేశారు.