రాష్ట్రంలోని ఉన్నత విద్య సీట్ల భర్తీలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్) కోటా ఈ విద్యా సంవత్సరమైనా అమలయ్యేనా?.. అధికారులతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఇదే ప్రశ్న తలెత్తుతోంది. ఈసెట్ కౌన్సెలింగ్ ఈ రోజు నుంచే ప్రారంభమైంది. మరోవంక.. మార్గదర్శకాలపై విద్యాశాఖ నుంచి జీవో రాకపోవడంతో ప్రవేశాల కమిటీ అధికారులు తాము సైతం దాని కోసమే ఎదురుచూస్తున్నామని చెబుతున్నారు. ఈసారి ఈసెట్ రాసిన 23వేల మందిలో దాదాపు 2వేల మంది తమకు ఈడబ్ల్యూఎస్ కోటా వర్తిస్తుందని దరఖాస్తు చేసుకున్నారు. వారంతా ఇప్పుడు అయోమయంలో పడ్డారు.
జనవరిలోనే నిర్ణయం తీసుకున్నా...
గత విద్యా సంవత్సరం(2020-21) కోటా అమలుకు వేలాది విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురుచూసినా ఆశ ఫలించలేదు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం 2020-21 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో కోటాను అమలుచేయాలి. అందుకే అధికారులు 2020 జూన్‌లోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దస్త్రాన్ని పంపించారు. దానిపై నిర్ణయం తీసుకోకపోవడంతో గతేడాది అమలు జరగలేదు. అనంతరం ఉన్నత విద్య సీట్ల భర్తీలో 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటా అమలుచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గత జనవరి 21న ప్రకటించారు. ఆ మేరకు సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) ఫిబ్రవరి 8న జీవో 33 జారీ చేసింది. అయితే కోటాను అమలు చేయాలంటూ విద్యాశాఖ మరో జీవో ఇస్తేనే సీట్ల భర్తీ సాధ్యమవుతుంది. అంటే 10 శాతం సీట్లను ఎలా భర్తీ చేయాలో అది మార్గదర్శకాలు జారీచేయాలి. ఈ క్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి రెండు ప్రతిపాదనలను ఇప్పటికే ప్రభుత్వానికి, విద్యాశాఖకు అందజేసింది. దానిపై విద్యాశాఖ తుది నిర్ణయం తీసుకొని తదనుగుణంగా జీవో ఇవ్వాలి.
జీవో వస్తేనే అమలుచేస్తాం...