ఇంజినీరింగ్, ఫార్మసీ, మెడికల్ తదితర వృత్తి విద్యా కోర్సుల ప్రవేశాల్లో గత రెండేళ్లుగా అటకెక్కిన క్రీడా కోటా వచ్చే విద్యా సంవత్సరం(2020-21) అయినా అమలు అవుతుందా? మరో నెల రోజుల్లో వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించి ప్రకటనలు (నోటిఫికేషన్లు) విడుదల కానున్న నేపథ్యంలో విద్యాశాఖ అధికారులతో పాటు విద్యార్థుల్లోనూ ఉత్కంఠ రేపుతున్న ప్రశ్న ఇది. ఆలోపు రాష్ట్ర ప్రభుత్వం 0.5 శాతం క్రీడా కోటా అమలుపై ఉత్తర్వు జారీ చేస్తేనే రిజర్వేషన్ అమలుకు వీలవుతుందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.
కోటా ఎందుకు ఆగింది?
వృత్తి విద్యా కోర్సుల్లో క్రీడాకారులకు 0.5 శాతం రిజర్వేషన్ ఉంటుంది. అంటే ప్రతి 200 సీట్లకు ఒక సీటును వారికి కేటాయిస్తారు. ఎంబీబీఎస్‌లో సీట్లు తక్కువగా ఉండటం వల్ల కొందరు బోగస్ క్రీడా ధ్రువపత్రాలు సృష్టించి అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలొచ్చాయి. ఈక్రమంలోనే మెడికల్ సీట్లలో అక్రమాలు జరిగాయని 2018లో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. కోటాను నిలుపుదల చేయాలని, మార్గదర్శకాలు మార్చాలని న్యాయస్థానం ఆదేశించింది. కొత్త మార్గదర్శకాలతో ప్రభుత్వం 2018 జూన్ 21న జీవో 7 జారీ చేసింది. అందులో ఎవరూ ఆడని క్రీడలను మార్గదర్శకాల్లో పెట్టారంటూ మళ్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. మార్పులు చేసి కోటాను అమలు చేసుకోవచ్చని హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలోనే 2018, 2019లో క్రీడా కోటా అమలు కాలేదు. వచ్చే విద్యా సంవత్సరం(2020-21)లో పునరుద్ధరించాలన్న ఆలోచనతో ఏ స్థాయి క్రీడలను కోటా అమలుకు పరిగణనలోకి తీసుకోవాలో విధి విధానాల ఖరారుకు ప్రభుత్వం 2019 సెప్టెంబరు 28న కమిటీ నియమించింది. కమిటీకి క్రీడా సాధికార సంస్థ ఎండీ ఛైర్మన్‌గా, మరో ఆరుగురు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది.