ప్రైవేట్ కళాశాలల అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ప్రైవేట్ ఆసుపత్రుల్లోని నర్సులు, పెద్ద రెస్టారెంట్లలో పనిచేసేవారు.. ఇలా అనేక వర్గాల వారు ఊళ్లకు వెళ్లి ఉపాధి పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. తాజాగా ప్రభుత్వం ఉపాధి హామీ కూలిని రోజుకు రూ.211 నుంచి రూ. 237కు పెంచింది. దీనికి వేసవి భత్యం కలిపితే ఇంతకన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. జాబ్‌కార్డులను కూడా అడిగిన వెంటనే మంజూరు చేస్తుండడం వల్ల ఉపాధి కూలీలుగా నమోదవడం సులువుగా మారింది. ఏప్రిల్ 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ పనులకు వచ్చిన కూలీల సంఖ్య 3.36 లక్షలు కాగా, మే 7న చూస్తే ఏకంగా 22.50 లక్షల మంది ఉండడం గమనార్హం.
ఆచార్యుడు.. హమాలీగా
కరీంనగర్ జిలా కొత్తపల్లి మండలం కమాన్‌పూర్ గ్రామం రాములపల్లెకు చెందిన తోడేటి అనిల్ ఎంటెక్ పూర్తి చేశారు. ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సహాయ ఆచార్యునిగా పనిచేస్తున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంటి వద్దే ఉంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో హమాలీగా పనికి కుదిరారు.