YS Bharti Cements Trial in the Supreme Court: భారతీ సిమెంట్స్ ఆస్తుల అటాచ్‌మెంట్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బ్యాంకు గ్యారెంటీలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల విడుదల విషయంలో భారతీ సిమెంట్స్‌కు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలంటూ ఈడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ రామసుబ్రహ్మణ్యం, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని ధర్మాసనం అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా భారతీ సిమెంట్స్‌ను ఆదేశించింది. ఆ తర్వాతే తదుపరి విచారణ చేపడతామని స్పష్టం చేసింది.
భారతీ సిమెంట్స్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. బ్యాంకు గ్యారెంటీ తీసుకొని ఆస్తులు, ఎఫ్‌డీలను విడుదల చేయాలని హైకోర్టు తీర్పునిచ్చిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. బ్యాంకు హామీ తీసుకున్న తర్వాత కూడా రూ.150 కోట్ల విలువైన ఎఫ్‌డీలను ఈడీ జప్తు చేసుకుందని కోర్టుకు వివరించారు. అయితే, ఎఫ్‌డీలను జప్తు చేసుకోలేదని ఈడీ తరఫున వాదించిన అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ కోర్టుకు తెలిపారు.