ED Raids In Hyderabad: దిల్లీ మద్యం ముడుపుల వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఈడీ అధికారులు హైదరాబాద్‌లో వరుసగా సోదాలు నిర్వహించడమే కాకుండా ప్రముఖ వ్యాపారి వెన్నమనేని శ్రీనివాసరావును తమ కార్యాలయానికి పిలిపించి దాదాపు ఏడు గంటలపాటు విచారించారు. దిల్లీ మద్యం సరఫరా కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడైన ప్రాథమిక సమాచారం ఆధారంగాఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
ED Raids In Hyderabad updates : హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని వెన్నమనేని ఇల్లు, కార్యాలయంతో పాటు రామంతాపూర్, మాదాపూర్‌లలోని ఐటీ సంస్థల్లోనూ ఈ సోదాలు జరిగాయి. గత శుక్రవారం దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించిన వాటిలో హైదరాబాద్ దోమల్‌గూడాలోని గోరంట్ల అసోసియేట్స్ కార్యాలయం ఉంది. దిల్లీ మద్యం సరఫరాకు కాంట్రాక్టు దక్కించుకున్న హైదరాబాద్ సంస్థలకు గోరంట్ల అసోసియేట్స్ ఆడిటింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది.
ED Raids In Delhi Liquor Scam : అందుకే అక్కడ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి పెద్దఎత్తున దస్త్రాలు, హార్డ్‌డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని విశ్లేషించినప్పుడు దిల్లీ మద్యం వ్యాపారంతో సంబంధం ఉన్న సంస్థల్లోకి జరిగిన నిధుల ప్రవాహానికి సంబంధించిన వివరాలు లభించాయని.. వీటి ఆధారంగానే సోమవారం ఈడీ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే వెన్నమనేని శ్రీనివాసరావును తమ కార్యాలయంలో విచారించినట్లు తెలుస్తోంది.