తెలంగాణ

telangana

ETV Bharat / state

టాలీవుడ్‌ మత్తుమందుల కేసులపై మరోసారి ఈడీ పరిశీలన - Ed On Tollywood Drugs Case

Tollywood Drugs Case: టాలీవుడ్​లో దుమారం రేపిన మత్తుమందుల కేసులను మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ పరిశీలించనుంది. గతేడాది కొంతమందిని విచారించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోమారు కేసులను పరిశీలించాలని ఈడీ భావిస్తోంది.

Tollywood Drugs Case
Tollywood Drugs Case

By

Published : Jun 1, 2022, 9:41 AM IST

Tollywood Drugs Case: పెనుదుమారం రేపి తుస్సుమన్న టాలీవుడ్‌ మత్తుమందుల కేసులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరోమారు పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కొందరిని విచారించి, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేసినా, పెద్దగా ఫలితం కనిపించలేదు. కానీ ఇందులో అంతుబట్టని వ్యవహారమేదో ఉన్నట్లు అనుమానిస్తున్న ఈడీ అధికారులు మరోమారు దీని దుమ్ము దులపాలని భావిస్తున్నట్లు సమాచారం. టాలీవుడ్‌ మత్తుమందులకు సంబంధించి తొలుత కేసులు నమోదు చేసిన ఆబ్కారీశాఖ దర్యాప్తులో వెల్లడైన అన్ని వివరాలూ తమకు అందించలేదని ఈడీ న్యాయస్థానంలోనే ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీన్ని బట్టి ఈ కేసులో ఈడీ ఎంత పట్టుదలతో ఉందో అర్థం చేసుకోవచ్చు.

2017లో ఆబ్కారీశాఖ నమోదు చేసిన టాలీవుడ్‌ మత్తుమందుల కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మొత్తం 12 కేసులు నమోదు చేసిన అధికారులు తెలుగు చిత్రపరిశ్రమలో అనేకమందికి మత్తుమందుల వినియోగం, సరఫరాలతో సంబంధం ఉందని తేల్చారు. అనేకమంది సినీప్రముఖులను పిలిపించి విచారించడం కలకలం రేపింది. కానీ క్రమంగా ఈ కేసు నీరుగారిపోయింది. రకరకాల కారణాలతో అభియోగపత్రాలు దాఖలు చేయడంలో తీవ్ర జాప్యం జరిగింది. ఎట్టకేలకు వాటిని దాఖలు చేసినా అందులో తెలుగు సినీప్రముఖులు మత్తుమందులు వినియోగించారనడానికి ఎలాంటి ఆధారాలూ లేవని తేల్చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై అనేక అనుమానాలు, విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ కేసును మర్చిపోతున్న తరుణంలో ఈడీ రంగంలోకి దిగింది.

మత్తుమందుల పేరుతో పెద్దఎత్తున నిధుల మళ్లింపు జరిగిందన్న అనుమానంతో గత ఏడాది కేసు నమోదు చేసిన ఈడీ మళ్లీ దర్యాప్తు మొదలుపెట్టింది. అనుమానితులైన సినీ ప్రముఖులను విచారించి వారి వాంగ్మూలాలు నమోదు చేసినా ఫలితం లేకపోయింది. అంతకుముందు ఈ కేసును దర్యాప్తు చేసిన రాష్ట్ర ఆబ్కారీశాఖ తమకు అన్ని వివరాలు ఇవ్వలేదని ఈడీ న్యాయస్థానంలో పిటిషన్‌ వేసింది. ఆబ్కారీ అధికారులు మాత్రం 12 కేసులకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లు, 828 పేజీలతో కూడిన దర్యాప్తు వివరాలు, 75 జీబీ వీడియోలు, నిందితుల ఫోన్లలో ఉన్న స్క్రీన్‌షాట్ల వంటి ఆధారాలన్నీ సమర్పించామని, ఇక తమ వద్ద ఏమీ లేవని స్పష్టం చేశారు. ప్రముఖుల ప్రమేయం ఉందని మొదట చెప్పిన ఆబ్కారీశాఖ ఆ తర్వాత ఆధారాలు లేవని చేతులెత్తేయడంపై ఈడీకి అనేక అనుమానాలున్నాయి. దాంతో ఈ కేసును మొదటి నుంచీ అధ్యయనం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details