ED Raids in Hyderabad : క్యాసినోలకు జనాలను తరలిస్తున్నారనే సమాచారంతో హైదరాబాద్‌లో పలువురి ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. గోవాలో క్యాసినోలు నిర్వహించడంతో పాటు నేపాల్, థాయ్‌లాండ్‌లలో జరిగే జూదంలో పాల్గొనేందుకు.. హైదరాబాద్‌కు చెందిన చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి సహా కొందరు ప్రత్యేక టూర్లు ఏర్పాటు చేస్తున్నారు. రానుపోను ఖర్చులతో కలిపి 5 రోజుల పాటు విదేశాల్లో ఉండేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. గతంలో ఎక్కువ మందిని శ్రీలంక తీసుకెళ్లేవారని ఈడీ అధికారులు గుర్తించారు. అక్కడి పరిస్థితులు సరిగా లేకపోవటంతో నేపాల్‌కు తరలిస్తున్నారని పేర్కొన్నారు. బుధవారం ఉదయం నుంచి బోయిన్‌పల్లిలోని మాధవరెడ్డి ఇంట్లో సోదాలు చేశారు. సైదాబాద్‌లోని చీకోటి ప్రవీణ్ ఇంట్లో అర్ధరాత్రి తనిఖీలు కొనసాగాయి. జూబ్లీహిల్స్ సహా మరో 8 ప్రాంతాల్లో ఈడీ బృందాలు సోదాలు చేశాయి. సాయంత్రం వరకూ జరిగిన తనిఖీల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
జూద పర్యటనలతో ఫెమా ఉల్లంఘనలు జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. దొడ్డిదారిలో విదేశాలకు సొమ్ము తీసుకెళుతున్నారని.. గెలుచుకున్న డబ్బును హవాలా ద్వారా స్వదేశానికి రప్పించుకుంటున్నారని అనుమానిస్తున్నారు. ఈ మధ్యకాలంలో నగరానికి చెందిన ఓ వ్యక్తి పెద్ద మొత్తంలో జూదంలో గెలుచుకొని.. దానిని హవాలా మార్గంలో స్వదేశానికి రప్పించినట్లు ఈడీకి సమాచారం అందిందని, దాని ఆధారంగానే దాడులు నిర్వహించారని తెలుస్తోంది.