Casino Issue: చీకోటి ప్రవీణ్ క్యాసినో దందాపై ఈడీ లోతుగా విచారిస్తోంది. కొందరు ముఖ్య నేతలకు ప్రవీణ్ బినామీగా వ్యవహరించాడని అనుమానాలు వ్యక్తం చేస్తోంది. కొన్నేళ్ల క్రితం ట్రూప్ బజార్‌లో టైల్స్ వ్యాపారిగా ఉన్న ప్రవీణ్.. అనతి కాలంలోనే రూ.కోట్లు సంపాదించడం వెనుక కారణాలు ఆరా తీస్తున్నారు. గోవా క్యాసినోలో ఏజెంట్‌గా గడించిన అనుభవంతో పంటర్లను ఏకంగా విదేశాలకు తరలించే స్థాయికి ప్రవీణ్ ఎదిగాడు. ఎమ్మెల్యేలు, మంత్రులు సహా ఐదు రాష్ట్రాల ప్రముఖులతో సంబంధాలు కొనసాగించే స్థాయికి చేరుకున్నాడు. క్యాసినోల నిర్వాహణతో రూ.కోట్లు చేతులు మారుతుండటంతో కొందరు రాజకీయ నేతలు డబ్బును విదేశాలకు తరలించి ఉంటారని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఆ విషయంపై నిగ్గు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. రేపు ప్రవీణ్‌తో పాటు అతడి అనుచరులను విచారించనున్నారు. విచారణ అనంతరం మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
చీకోటి ప్రవీణ్, దాసరి మాధవరెడ్డి ఆర్ధిక వ్యవరాలపైనా ఈడీ అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే వారి బ్యాంకు ఖాతాలు పరిశీలించగా.. ప్రముఖులతో లావాదేవీలను గుర్తించినట్లు తెలుస్తోంది. ఇంకా ఎవరెవరితో లావాదేవీలు జరిగాయనే వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు. పంటర్లను విదేశాల్లోని క్యాసినోలకు తరలించే సమయంలో వారి నుంచి ప్రవీణ్ బృందం ఇక్కడే నగదు తీసుకున్నారని భావిస్తున్నారు. అక్కడికి వెళ్లాక క్యాసినోలో కాయిన్లు ఇచ్చి జూదం ఆడించినట్లు అనుమానిస్తున్నారు. క్యాసినోలో ఎవరైనా డబ్బు గెలుచుకుంటే తిరిగి వచ్చిన తర్వాత చెల్లింపులు చేశారని.. ఆ క్రమంలో పెద్ద ఎత్తున హవాలా జరిగినట్లు యోచిస్తున్నారు.
క్యాంపులు నిర్వహించి.. రూ.కోట్లు పోగేసి..: ఈ దందాలో పంటర్ల నుంచి కమీషన్ రూపంలో ప్రవీణ్ భారీగా సంపాదించాడని అధికారులు గుర్తించారు. ఆ సొమ్మును హవాలా మార్గంలో తీసుకొచ్చాడనే అంశంపైనా విచారణ చేస్తున్నారు. కొంతకాలంగా నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్, ఇండోనేషియాలో ఏడు క్యాంపులు నిర్వహించడం ద్వారా రూ.కోట్లు పోగేసినట్లు జరుగుతున్న ప్రచారంపై కూపీ లాగుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఏజెంట్లే కీలకం కావడంతో వారిని విచారించి మరిన్ని వివరాలు రాబట్టాలని భావిస్తున్నారు. ప్రవీణ్ ప్రధాన అనుచరుడు సంపత్ నుంచి కీలక సమాచారం లభిస్తుందని అనుకుంటున్నారు. కేసుకు సంబంధించి ఐదుగురు హవాలా ఏజెంట్లు సహా 8 మందికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.