Investigating agencies are hitting Telangana : రాష్ట్రంలో దర్యాప్తు సంస్థలు కలకలం సృష్టిస్తున్నాయి. ఓ వైపు ఎమ్మెల్యేలకు ఎర కేసు, ఇంకోవైపు దిల్లీ మద్యం కేసు, మధ్యలో ఈడీ, ఐటీ శాఖల దాడులు, విచారణలతో రాష్ట్రంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న వాతావరణం నెలకొంది. ఒక మంత్రిపై గ్రానైట్ వ్యవహారంలో ఈడీ విచారణ జరపగా, అది ముగియకముందే మరో మంత్రి లక్ష్యంగా పెద్దఎత్తున ఆదాయపన్నుశాఖ దాడులతో ప్రాధాన్యం సంతరించుకుంది. మరో మంత్రి కుటుంబ సభ్యులను, వ్యక్తిగత సహాయకుడిని కూడా ఈడీ విచారించింది. మరికొందరిపైనా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉందని కొంతమంది నేతలు బహిరంగంగానే అంటున్నారు. సీబీఐ అడుగుపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం కావడంతో అది నేరుగా కేసులు నమోదు చేయలేకపోతోందని, లేకుంటే ఆ సంస్థ కూడా రాష్ట్రంలో చురుగ్గా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇతర రాష్ట్రాల్లో ఏకపక్షంగా దాడులు చేయగలిగిన కేంద్ర దర్యాప్తు సంస్థలు.. తెలంగాణలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
ఇటు రాష్ట్ర ప్రభుత్వం.. అటు కేంద్ర ప్రభుత్వం: దిల్లీ మద్యం విధానం తయారీలో భారీగా డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలతో ఈడీ మొదట రాష్ట్రంలో దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును భాజపా నాయకులు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. నెల రోజులకు పైగా ఈ ప్రచారం జరుగుతున్నా ఈడీ అక్కడివరకు రాలేదు. అయితే ఏ రోజు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఎమ్మెల్యేల ఎర కేసును తీవ్రంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. సిట్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించడమే కాదు.. బీజేపీలో కీలకనేతగా ఉన్న బీఎల్ సంతోష్‌ను విచారణకు పిలుస్తూ నోటీసు ఇచ్చింది. దీంతో ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విచారణను నిలిపివేయించేందుకు బీజేపీ నాయకులు కోర్టులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. మరికొందరు ముఖ్యనాయకులకూ నోటీసులు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ప్రధాన నిందితుడు రామచంద్రభారతికి కేంద్రంలోని మంత్రులు, ఆర్ఎస్సేస్ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. వారు కలిసి ఉన్న ఫొటోలు కూడా వెలుగులోకి వచ్చాయి.