తెలంగాణ

telangana

ETV Bharat / state

TSPSC Paper Leakage Case : 'కేసు వివరాలు ఇచ్చేలా సిట్‌ను ఆదేశించండి'

ED on TSPSC Paper Leakage Issue : టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ఈడీ ఇవాళ మరోసారి కోర్టును ఆశ్రయించింది. కేసుకు సంబంధించిన వివరాలు సిట్​ ఇవ్వకపోవడంతో నాంపల్లి కోర్టులో ఈడీ మరో పిటిషన్​ దాఖలు చేసింది. మరోవైపు ఇదే కేసులో ఇవాళ కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌ అధికారి శంకరలక్ష్మి ఈడీ విచారణకు హాజరయ్యారు.

ED on TSPSC Paper Leakage
ED on TSPSC Paper Leakage

By

Published : Apr 13, 2023, 4:08 PM IST

ED on TSPSC Paper Leakage Issue : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఈడీ.. దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇవాళ నాంపల్లి కోర్టులో మరో పిటిషన్​ దాఖలు చేసింది. టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీక్‌ కేసులో సిట్‌ వివరాలు ఇవ్వకపోవడంపై ఈ పిటిషన్‌ వేసినట్లు పేర్కొంది. మార్చి 23న కేసుకు సంబంధించిన మొత్తం 8 డాక్యుమెంట్లు ఇవ్వాలని కోరుతూ సిట్​కు ఈడీ లేఖ రాసిన విషయం తెలిసిందే.

వివరాలు ఇవ్వడం కుదరదు :అయినా ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి సిట్ వివరాలు ఇవ్వకపోవడంతో నేడు మరోసారి ఈడీ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును మనీ లాండరింగ్‌ కోణంలో దర్యాప్తు చేయాలని ఈడీ భావిస్తోంది. కేసు వివరాలు ఇచ్చేలా సిట్‌కు ఆదేశాలు ఇవ్వాలని ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ నాంపల్లి కోర్టును కోరింది. మరోవైపు ఈడీ పిటిషన్‌పై సిట్ కౌంటర్ దాఖలు చేసింది. కేసు కీలక దశలో ఉన్నందున వివరాలు ఇవ్వడం కుదరదని సిట్ వెల్లడించింది.

ఈడీ విచారణకు హాజరైన శంకర్​లక్ష్మి : మరోవైపు టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతమైంది. ఈ క్రమంలోనే కమిషన్‌ అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణ, కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌ అధికారి శంకరలక్ష్మికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు ఇదివరకే నోటీసులు జారీ చేశారు. బుధ లేదా గురువారాల్లో విచారణకు రావాలని తాఖీదుల్లో పేర్కొన్నారు. ప్రశ్నపత్రం కోసం ఎంత డబ్బు చేతులు మారాయి.. ఆ సొమ్మంతా ఎటుపోయింది తదితర విషయాల గుట్టు తేల్చే పనిలో ఈడీ అధికారులు ఉన్నారు. ఈ క్రమంలో ఇవాళ శంకరలక్ష్మి ఈడీ విచారణకు హాజరయ్యారు. సెక్షన్ 50 ప్రకారం శంకర్‌లక్ష్మి వాంగ్మూలం ఈడీ రికార్డ్ చేయనుంది. టీఎస్‌పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ రూమ్ ఇంఛార్జ్‌గా ఆమె ఉన్నారు.

ఈ నెల 11న ఈ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారానికి సంబంధించిన డాక్యుమెంట్లు.. తమకు ఇవ్వాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నాంపల్లి కోర్టులో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబందించి మీడియా కథనాలు, ప్రచారంలో ఉన్న సమాచారం, నిఘావర్గాలు ఇచ్చిన వివరాల ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ.. డాక్యుమెంట్లు ఇవ్వాలని మార్చి 23నే సీసీఎస్​ ఏసీపీకి లేఖ రాసినట్టు పిటిషన్‌లో పేర్కొంది. టీఎస్​పీఎస్సీ పేపర్‌ లీకేజీలో మనీ లాండరింగ్‌ జరిగినట్టు అనుమానిస్తున్న ఈడీ.. పీఎంఎల్​ఏ సెక్షన్‌ 50 కింద కేసులో నిందితులైన ప్రవీణ్‌, రాజశేఖర్‌ వాంగ్మూలాలు రికార్డు చేయనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైళ్లో ఉన్న ఆ ఇద్దరినీ నలుగురు అధికారులతో కూడిన బృందం విచారిస్తుందని.. ఈడీ కోర్టుకు వివరించింది. ఈ విచారణ సమయంలో.. లాప్‌టాప్, ప్రింటర్, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని ఈడీ తన పిటిషన్‌లో కోరింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details