ED arrests gautam malhotra in Delhi liquor scam : దిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో మరొకరు అరెస్టయ్యారు. ఈ స్కామ్‌లో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) మరొకరిని అరెస్టు చేసింది. మద్యం పాలసీ రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన గౌతమ్ మల్హోత్రాను... ఈడీ అధికారులు అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి గౌతమ్ మల్హోత్రాను కస్టడీలోకి తీసుకున్నారు. ఆయణ్ను సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. మద్యం వ్యాపారులతో గౌతమ్ మల్హోత్రాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే నేపథ్యంలోనే అతన్ని ఈడీ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
Delhi liquor scam Updates : ఇక ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఛార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సైతం సీబీఐ అరెస్టు చేసింది. దిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు పాత్ర ఉందని.. హైదరాబాద్‌కు చెందిన పలు సంస్థలకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
దర్యాప్తులో భాగంగా నిన్న బుచ్చిబాబును ప్రశ్నించిన సీబీఐ అధికారులు.. విచారణ తర్వాత అదుపులోకి తీసుకుంటున్నట్లు ఆయనకు చెప్పారు. అనంతరం బుచ్చిబాబు అరెస్టును అధికారికంగా వెల్లడించారు. వైద్య పరీక్షల తర్వాత బుచ్చిబాబును కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.
MLC Kavitha in Delhi liquor scam: మరోవైపు ఈ స్కామ్ అనుబంధ ఛార్జిషీట్‌లో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత పేరును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రస్తావించిన విషయం తెలిసిందే. పంజాబ్, గోవా ఎన్నికల ప్రచారం నిధుల కోసమే.. ఆప్ నేతలు మద్యం కుంభకోణానికి తెరలేపినట్లు ఈడీ పేర్కొంది. కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన ఆప్ మీడియా వ్యవహారాల ఇంచార్జి విజయ్ నాయర్.. అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడని వెల్లడించింది.