Delhi Liquor Scam Case Updates: అరుణ్ రామచంద్ర పిళ్లైని రౌస్ అవెన్యూ కోర్టు వారం రోజులు ఈడీ కస్టడీకి ఇచ్చింది. మార్చి 13 వరకు ఈడీ కస్టడీకి అనుమతి ఇస్తూ.. కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈడీ వాదనతో ఏకీభవించిన రౌస్ అవెన్యూ కోర్టు, కస్టడీలో తన తల్లితో ఫోన్లో మాట్లాడేందుకు అరుణ్ పిళ్లైకి అనుమతి ఇచ్చింది. ప్రతి రోజు కస్టడీలో ఉన్న పిళ్లైని కలిసేందుకు అతని భార్య, బావమరిదికి కోర్టు అనుమతినిచ్చింది. ఈ మేరకు హైపో థైరాయిడిజం మందులు, వెన్ను నొప్పికి బెల్ట్‌కి అనుమతినిచ్చింది. పిళ్లై విచారణ అంతా... వీడియో రికార్డు చేయాలని ఈడీకి ఆదేశాలు పంపింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ అక్రమ మద్యం కుంభకోణం కేసులో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. రోజురోజుకూ ఈడీ తన దర్యాప్తును ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న 11 మందిని అరెస్టు చేసిన ఈడీ.. తాజాగా ఈ కేసుతో సంబంధం ఉన్న హైదరాబాద్‌కు చెందిన రామచంద్ర పిళ్లైని సోమవారం రాత్రి 11 గంటలకు అరెస్ట్ చేసింది. ఇటీవలే రెండు రోజుల పాటు రామచంద్ర పిళ్లైను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ క్రమంలోనే నిన్న రాత్రి అరెస్ట్ చేశారు.
Delhi Liquor Scam Latest Updates: రాబిన్ డిస్టిలరీస్ పేరుతో రామచంద్ర పిళ్లై వ్యాపారం నిర్వహిస్తుంటాడు. దిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో సీబీఐ ఇతడిని నిందితునిగా పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అతని వ్యాపార సముదాయాలు, ఇతర నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ రెండుసార్లు సోదాలు నిర్వహించింది. ఆ సోదాలలో దొరికిన వివరాల ఆధారంగా ఇటీవల రెండు రోజుల పాటు ఈడీ రామచంద్ర పిళ్లైని ప్రశ్నించింది.