ED and IT Raids in Telangana: రాష్ట్రంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ఈడీ, ఆదాయ పన్ను-ఐటీ శాఖ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం దిల్లీ మద్యం కుంభకోణం కేసులో తనిఖీలు చేసిన దర్యాప్తు సంస్థలు కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుండగానే... తాజాగా కొన్ని గ్రానైట్ సంస్థలు అక్రమాలకు పాల్పడ్డాయన్న ఆరోపణలతో ఈడీ, ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
కరీంనగర్‌లోని 9 గ్రానైట్ సంస్థలు అక్రమాలకు పాల్పడ్డాయని పేరాల శేఖర్ రావు కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఎన్జీటీ, కేంద్ర పర్యావరణశాఖకు... గతేడాది ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వివరాలను దర్యాప్తు సంస్థలకు అందించారు. అదే విషయంపై 2019లో బండి సంజయ్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఆ రెండు ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు సంస్థలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ఈడీ, ఐటీ శాఖ అధికారులు 20 బృందాలుగా విడిపోయి హైదరాబాద్, కరీంనగర్‌లోని గ్రానైట్ సంస్థల యజమానుల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ సోమాజీగూడలోని.. పీఎస్ఆర్ గ్రానైట్స్ కార్యాలయం, హైదర్‌గూడ ఉప్పరపల్లిలోని... ఎస్వీజీ గ్రానైట్స్ అధినేత ఇళ్లు, కార్యాలయంలో సోదాలు చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా ఎగుమతులు చేపట్టారనే సమాచారంతో.. కంపెనీ అధినేత శ్రీధర్‌రావుకి కరీంనగర్‌లోని మూడు గ్రానైట్ క్వారీలతో సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. క్వారీల నుంచి గోదాంలో ఉంచిన గ్రానైట్‌ను పోర్టులకు తరలించండంలో ఆయన కీలకపాత్ర పోషించినట్లు అధికారులు భావిస్తున్నారు. హిమాయత్ నగర్‌లోని శ్వేతా గ్రానైట్స్ సహా బంజారాహిల్స్‌లోని గ్రానైట్ కార్యాలయంలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. తెల్లవారుజాము నుంచే అధికారులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి దాడులు చేశారు. గ్రానైట్ సంస్థలు హవాలా, మనీలాండరింగ్, అక్రమ మైనింగ్‌లతో నిబంధనలకు విరుద్ధంగా ఎగుమతులు చేపట్టారనే సమాచారం మేరకు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.