తెలంగాణ

telangana

ETV Bharat / state

దిల్లీ లిక్కర్ స్కామ్.. బయటపడుతున్న అరబిందో శరత్‌ చంద్రారెడ్డి లీలలు - దిల్లీ మద్యం కుంభకోణం

Delhi Liquor scam updates : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కుంభకోణం, తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. కేసు దిల్లీకి చెందినప్పటికీ, దర్యాప్తు మాత్రం తెలుగు రాష్ట్రాల చుట్టూ తిరుగుతోంది. ఈ కేసులో అరబిందో గ్రూప్‌ డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డిని ఈడీ అరెస్ట్‌ చేసింది. ఈయన వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు. దిల్లీ మద్యం వ్యాపారంలో 30శాతం శరత్‌ గుప్పిట్లో ఉన్నట్లు రిమాండ్‌ రిపోర్టులో ఈడీ ఆరోపించింది.

Delhi Liquor scam updates
Delhi Liquor scam updates

By

Published : Nov 11, 2022, 11:28 AM IST

బయటపడుతున్న అరబిందో శరత్‌ చంద్రారెడ్డి లీలలు

ED allegations against sarat chandra reddy: దిల్లీ మద్యం కేసులో అరెస్ట్‌ అయిన అరబిందో గ్రూప్‌ డైరెక్టర్‌ శరత్‌చంద్రారెడ్డి, మరో నిందితుడు బినోయ్‌బాబుకు.. రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు వారంరోజులు ఈడీ కస్టడీకి అనుమతించింది. బుధవారం అర్ధరాత్రి 12గంటల 20 నిమిషాలకు ఇద్దరు నిందితులను దిల్లీలో అరెస్ట్‌ చేసిన అధికారులు, గురువారం మధ్యాహ్నం సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. వాదనల అనంతరం వారంరోజుల ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ సందర్భంగా, కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో శరత్‌ చంద్రారెడ్డికి సంబంధించిన కీలక విషయాలను ఈడీ వెల్లడించింది. దిల్లీ మద్యం కుంభకోణంలో శరత్‌చంద్రారెడ్డే కీలక సూత్రధారని.. మొత్తం మార్కెట్‌లో 30శాతానికిపైగా దక్కించుకోవడంతోపాటు, దక్షిణాది రాష్ట్రాల నుంచి టెండర్లు చేజిక్కించుకున్నవారితో సౌత్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసినట్లు ఈడీ పేర్కొంది. బినామీ కంపెనీల ద్వారా నిబంధనలకు విరుద్ధంగా 9 రిటైల్ జోన్స్‌ దక్కించుకున్నారని, అందుకోసం భారీగా ముడుపులు చెల్లించినట్లు తెలిపింది. సౌత్‌ గ్రూప్‌కు సంబంధించి 100 కోట్లు.. విజయ్‌నాయర్‌ ద్వారా ముడుపులు చెల్లించినట్లు తెలిపింది.

Delhi Liquor scam updates : శరత్‌కు చెందిన 3కంపెనీల ద్వారా 64.35కోట్లు ఇప్పటికే అక్రమంగా సంపాదించినట్లు వివరించింది. ఇందులో 60కోట్లు ఇండో స్పిరిట్స్ కంపెనీకి తరలించినట్లు విచారణలో బయటపడినట్లు ఈడీ పేర్కొంది. మొత్తం వ్యవహారానికి సంబంధించిన ఆధారాలు దొరకకుండా చేసేందుకు .. డిజిటల్‌ సర్వర్లలోని సమాచారాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపించింది. దర్యాప్తు ప్రారంభం అయిన తర్వాత.. క్రెడిట్‌ నోట్లు వెనక్కి తీసుకున్నట్లు నకిలీపత్రాలు సృష్టించినట్లు రిమాండ్‌ రిపోర్టులో ఈడీ పేర్కొంది.

ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ నుంచి 200కోట్ల బ్యాంకు గ్యారెంటీలను ఇండో స్పిరిట్స్‌కు ఇచ్చారని ఈడీ న్యాయవాదులు తెలిపారు. ట్రైడెంట్‌కు ప్రాక్సీ సంస్థలుగా ఉన్న ఆర్గనోమిక్స్‌ ఎకో సిస్టమ్స్‌, అవంతికా కాంట్రాక్టర్స్‌ ద్వారా.. రిటైల్‌ జోన్లు దక్కించుకుని.. ఎక్సైజ్‌ విధానం నిబంధనలను అతిక్రమించారని వివరించారు. మూడు ఎల్‌-7 కంపెనీలను శరత్‌ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు ఆయన దగ్గర పనిచేసే ఉద్యోగులే చెప్పారని ఈడీ పేర్కొంది. దేశంలోనే అతిపెద్ద మద్యం ఉత్పత్తిదారులైన పెన్నోడ్‌ రికార్డ్‌- పిఆర్‌ఐ భాగస్వాములైన సమీర్‌ మహేంద్రు, అరుణ్‌ పిళ్లై, ప్రేంరాహుల్‌ మండూరితో ఆర్ధికలావాదేవీలు ఉన్నాయని.. ఇండో స్పిరిట్‌లో శరత్‌ చంద్రారెడ్డి పెట్టుబడులు పెడుతున్నట్లు.. సౌత్‌ గ్రూప్‌లో సభ్యుడుగా ఉన్న దినేష్‌ అరోరా తన వాంగ్మూలంలో పేర్కొన‌్నట్లు ఈడీ వెల్లడించింది. శరత్‌ చంద్రారెడ్డి నిబంధనలకు విరుద్దంగా... నేరుగా ఐదు రిటైల్‌ జోన్లను బినామీలు, ప్రాక్సీల ద్వారా నియంత్రించినట్లు పేర్కొంది.

ట్రైడెంట్‌ ఛాంపర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఆర్గనోమిక్స్‌ ఎకోసిస్టమ్స్‌, శ్రీఅవంతిక కాంట్రాక్టర్స్‌ ద్వారా శరత్‌ నేరుగా కార్యకలాపాలు జరిపినట్లు పేర్కొంది. అంతేకాక... గ్రూపు సభ్యులుగా మరో 4జోన్లు కూడా అదుపు చేసినట్లు తెలిపింది. ఇప్పటివరకు 169 సార్లు జరిపిన సోదాల్లో.. పెద్దమొత్తంలో డిజిటల్‌, భౌతిక ఆధారాలు లభ్యం అయినట్లు దర్యాప్తు సంస్థ బయటపెట్టింది. ప్రజాభిప్రాయ సేకరణకు ముందే బినోయ్‌ బాబుకు ఈ-మెయిల్‌ ద్వారా దిల్లీ మద్యం విధానపత్రం లభించిందని.. తద్వారా ఏవిధంగా తదుపరి చర్యలు తీసుకోవాలో ముందుగానే నిర్ణయించుకున్నారని ఈడీ ఆరోపించింది. దర్యాప్తునకు సహకరించనందునే శరత్‌ చంద్రారెడ్డిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపింది.
దిల్లీ మద్యం కేసు దర్యాప్తు మొత్తం తెలుగురాష్ట్రాల చుట్టే తిరుగుతోంది. ఇప్పటికే అభిషేక్ కటకటాలపాలు కాగా.. ఇప్పుడు శరత్‌ చంద్రారెడ్డి అరెస్ట్ చర్చనీయాంశమైంది. ఆయన వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌రెడ్డి సోదరుడు. ఈ కుంభకోణంతో విజయసాయిరెడ్డి అల్లుడికి కూడా సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దిల్లీ మద్యం కుంభకోణంలో కీలకపాత్ర వహించిన ట్రైడెంట్‌ కెమ్‌ఫర్‌ సంస్థలో రోహిత్‌రెడ్డికి చెందిన ఆర్‌పీఆర్‌ సన్స్‌ అడ్వయిజర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు 99.99శాతం వాటాలు ఉన్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details