రాష్ట్రంలో పన్ను ఎగవేతదారులను సులభంగా గుర్తించేందుకు ప్రత్యేక ఆర్థిక నిఘా విభాగం(Economist Intelligence Unit) కీలక పాత్ర పోషిస్తోంది. రాష్ట్రంలో చెల్లించాల్సిన పన్నులు ఇతర రాష్ట్రాల్లో చెల్లిస్తుండడం లాంటి వాటిని గుర్తించేందుకు 2018 సెప్టెంబరులో ఇది ఏర్పాటైంది. ఈ విభాగం అదనపు కమిషనర్ నేతృత్వంలో దాదాపు 30 మంది అధికారులు, సిబ్బందితో పని చేస్తున్నారు. విలువ ఆధారిత పన్ను-వ్యాట్(vat) స్థానంలో 2017లో జులై నుంచి వస్తు సేవల పన్ను-జీఎస్టీ వచ్చింది. వ్యాట్‌ను ఆరిజిన్ బేస్‌డ్ ట్యాక్స్‌గా, జీఎస్టీ(GST) యుటిలైజేషన్ బేస్‌డ్ ట్యాక్స్‌గా పిలుస్తారు. అంటే వ్యాట్ అమలులో ఉన్నప్పుడు పరిశ్రమలు ఎక్కువగా ఉండి ఉత్పత్తి అయ్యే రాష్ట్రాల్లో ఎక్కువ పన్నులు వచ్చేవి. జీఎస్టీ వచ్చిన తర్వాత ఎక్కడైతే వస్తువులుకాని, సేవలుకాని వినియోగం ఉంటుందో అక్కడే పన్నులు చెల్లించాలి.
ప్రత్యేక భూమిక
జీఎస్టీ చట్టం-2017కు అనుగుణంగా ఆయా సంస్థలు సాప్ట్‌వేర్‌లో మార్పులు చేసుకుని పన్ను చెల్లింపులు చేయాల్సి ఉంది. కానీ చాలా సంస్థలు అలా చేయకుండా గతంలో మాదిరిగానే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చిరునామాలనే ఉంచడంతో... రాష్ట్రానికి రావాల్సిన పన్నులు ఇతర రాష్ట్రాలకు వెళ్తుండేవి. అలాంటి వాటిని గుర్తించి... ఎగవేతకు గురవుతున్న పన్నులు వసూలు చేసేందుకు రెగ్యులర్ అధికారులతో సాధ్యం కాదని అప్పటి వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శి, ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గుర్తించారు. పన్ను ఎగవేతకు పాల్పడుతున్న సంస్థలను గుర్తించడం కోసం ఈ నిఘా ప్రత్యేక భూమిక పోషిస్తోంది.
ప్రభుత్వ ఆదాయం కోసం
ప్రత్యేక ఆర్థిక నిఘా విభాగం ఎగవేతకు గురైన వసూళ్లు, పక్కదారి పడుతున్న పన్నులను గుర్తించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చి పెట్టేందుకు ఏర్పాటైంది. ఏటా ఈ విభాగం ప్రత్యేక డ్రైవ్ పేరున ముందుకు వెళ్తోంది. 2018-19 ఆర్థిక ఏడాదిలో "రెవెన్యూ ఆక్సన్ ప్లాన్-ర్యాప్'' పేరుతో, 2019-20లో "రెవెన్యూ ఎనాన్స్‌మెంట్ ఆక్సన్ ప్లాన్-రీప్'' పేరుతో, 2020-21లో "ఫోకస్‌డ్ రెవెన్యూ డ్రైవ్-ఎఫ్‌ఆర్‌డీ'' పేరున ఈ ఆర్థిక నిఘా విభాగం-ఈఏయూ పని చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొదటి నుంచి కొవిడ్ ప్రభావం ఉండడంతో ఇంకా ప్రణాళికలు సిద్ధం చేసుకునే పనిలో ఉన్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఏటా ఎగవేతకు గురైన, పక్కరాష్ట్రాలకు పోతున్న రూ.వందల కోట్ల పన్నులు ఈ విభాగం గుర్తిస్తున్నట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పేర్కొన్నారు.