రాష్ట్ర వార్షిక బడ్జెట్‌తో పాటు 2020-21కి సంబంధించి తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే రాష్ట్రం మెరుగైన ప్రదర్శనే కనబరిచినట్లు పేర్కొంది. ఈ ఏడాది అన్ని రంగాలు దెబ్బతిన్నా.. వ్యవసాయ అనుబంధ రంగాలు పురోగమించాయి. రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధరంగం 20.9 శాతం వృద్ధి రేటు సాధించినట్లు పేర్కొంది.
అనూహ్య పెరుగుదల...
జాతీయ స్థాయిలో ఆ రంగంలో 3 శాతానికే వృద్ధిరేటు పరిమితమైనా... రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎప్పుడూ లేనివిధంగా వ్యవసాయ అనుబంధ రంగాల వాటా జీఎస్డీపీలో అనూహ్యంగా పెరిగింది. 2020-21లో పరిశ్రమల రంగం 5.6 శాతానికి, సేవల రంగం 4.9 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి. జాతీయస్థాయిలో ఆ రంగాల ప్రదర్శనతో పోల్చి చూసినప్పుడు తెలంగాణలోని ఈ రంగాలు మెరుగైన ప్రదర్శన కనబరిచాయని సర్వే తెలిపింది.
సేవా రంగం వాటా...
2020-21లో జీఎస్డీపీలో సేవల రంగం వాటా 54 శాతంగా ఉంది. ఆ సమయంలో పరిశ్రమల వాటా 26, వ్యవసాయ అనుబంధ రంగాల వాటా 20 శాతానికి పరిమితమైనట్లు ఆర్థికసర్వే తెలిపింది. 2019-20లో వ్యవసాయ రంగం వాటా 18 శాతం, పరిశ్రమల రంగం వాటా 27 శాతం, సేవా రంగం వాటా 55 శాతం ఉందని వివరించింది.
కీలకపాత్ర...
దేశ ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ 23.5 శాతం వాటాతో కీలక పాత్ర పోషిస్తోంది. 2020లో మూడు వేల కంపెనీలు రాష్ట్రంలో విస్తరణ, పెట్టుబడులతో రూ. 30వేల667 కోట్లను ఆర్జించింది. తద్వారా కొత్తగా రూ. లక్షా79 వేల మందికి ఉపాధి లభించింది. ఈజ్‌ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రం తొలి 3 స్థానాల్లో కొనసాగుతోంది.