ECIR registered by ED officials in case of baiting MLAs: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఈడీ అధికారులు నమోదు చేసిన ఈసీఐఆర్ మలుపులు తిరుగుతోంది. ఈసీఐఆర్‌ను నిలిపేయాలని అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు ఇవాళ విచారించే అవకాశం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా ఈడీ అధికారులు తనపై మనీలాండరింగ్ కేసు నమోదు చేశారని చట్టాలను అతిక్రమించి వ్యవహరిస్తున్నట్లు ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు.
అటు ఈడీ మాత్రం ఈ కేసు దర్యాప్తులో ముందుకే వెళ్తోంది. ఈ కేసులో అధికారులు ఇప్పటికే రోహిత్‌రెడ్డిని రెండు రోజులపాటు విచారించారు. రోహిత్‌రెడ్డికి సంబంధించిన బ్యాంకు ఖాతాలు తన పేరున ఉన్న వాహనాల వివరాలను సేకరించారు. ఆధార్, పాన్‌కార్డు, పాస్ పోర్టుల జిరాక్స్ పత్రాలను తీసుకున్నారు. బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ఈడీ అధికారులు ఇతర అంశాలపైనా దృష్టి పెట్టారు.
మనీలాండరింగ్ కేసులో భాగంగానే సెవెన్ హిల్స్ మానిక్‌చంద్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అభిషేక్ ఆవలను ఈడీ అధికారులు ప్రశ్నించారు. రోహిత్‌రెడ్డి సోదరుడు రితీశ్‌రెడ్డితో అభిషేక్ ఆవలకు జరిగిన లావాదేవీల గురించి ప్రశ్నించారు. రితీశ్‌రెడ్డితో వ్యాపారం నిర్వహించినట్లు ఈడీ అధికారులకు చెప్పిన అభిషేక్ ఆ మేరకు వివరాలను అందించారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్‌ను ఈడీ అధికారులు ఇప్పటికే రెండు రోజులపాటు ప్రశ్నించారు.