Telangana Assembly Elections 2023: శాసనసభ ఎన్నికల సన్నద్ధత, ఓటరు జాబితా సంబంధిత అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సమావేశం నిర్వహించారు. బుద్ధభవన్‌లో జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం, సీపీఎం, మజ్లిస్ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. షెడ్యూల్ ప్రకారం నవంబర్, డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సీఈవో తెలిపారు.
అందుకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను అనుసరించి.. సన్నాహకాలు ప్రారంభించినట్లు వివరించారు. 17 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు వారిని ఓటర్ల జాబితాలో చేర్చడం, పోలింగ్ కేంద్రాలు, వాటిలో సౌకర్యాలు, ఓటర్ల జాబితా, ఫోటో సిమిలర్ ఎంట్రీల పరిశీలన తదితరాల గురించి వికాస్ రాజ్ ఆరా తీశారు. జూన్ ఒకటో తేదీ నుంచి ఈవీఎంల మొదటి దశ తనిఖీ, అధికారులకు శిక్షణ గురించి వివరించారు. రాజకీయ పార్టీలు అన్ని బూత్‌లకు ఏజెంట్లను నియమించాలని కోరిన సీఈవో.. 34 వేల 891 పోలింగ్ కేంద్రాలకు గానూ కేవలం 1785 మంది ఏజెంట్లను మాత్రమే నియమించినట్లు పేర్కొన్నారు.
వీలైనంత త్వరగా అన్ని కేంద్రాలకు ఏజెంట్లను నియమించాలని కోరారు. ఓటరు జాబితా నుంచి తొలగింపులు, ఫొటో సిమిలర్ ఎంట్రీల విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఈఆర్ఓలను ఆదేశించినట్లు ఈసీ తెలిపారు. డేటా నమోదు సమయంలో పొరపాట్లకు ఆస్కారం లేకుండా చూడాలని చెప్పినట్లు పేర్కొన్నారు. ఓటరు జాబితాకు సంబంధించి వివిధ దరఖాస్తులు నాలుగు లక్షలు పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు.
ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా సహకరించాలని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. గరుడ యాప్ సహా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొస్తున్న ఐటీ చర్యలను తమకు వివరించాలని కోరిన రాజకీయ పార్టీల ప్రతినిధులు.. ఒకే ఇంట్లో ఎక్కువగా నమోదైన ఓట్లపై దృష్టి సారించాలని కోరారు. సరైన అర్హతలు లేని బీఎల్ఓల ద్వారా ఇబ్బందులు తలెత్తుతున్నాయని.. హైదరాబాద్‌లో ఈ పరిస్థితి అధికంగా ఉందని తెలిపారు.