EC Polling Arrangements in Telangana: రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకొంది. అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ నెల మూడో తేదీన నోటిఫికేషన్ వెలువడగా.. అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరించారు. 15వ తేదీన అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. ఇవాళ్టితో ప్రచారం పరిసమాప్తమైంది. శాసనసభ ఎన్నికల్లో మొత్తం 2,290 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 2,068 మంది పురుషులుండగా.. 221 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్‌జెండర్ ఉన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఒకే విడతలో ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభమవుతుంది. పోలింగ్ కంటే 90 నిమిషాలు ముందు అనగా.. ఉదయం 5 గంటల 30 నిమిషాలకు మాక్‌పోలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. 13 నియోజకవర్గాల్లో 30న సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాలు ఈ జాబితాలో ఉన్నాయి. మిగతా 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది.
తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారపర్వం - రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి
"ఈవీఎంలు, ఎన్నికల పోలింగ్ సామాగ్రి అంతా బుధవారం ఆ యా కేంద్రాలకు వెళ్తోంది. ప్రస్తుతం ఆ ఏర్పాట్లలోనే ఉన్నాం. 2,290 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అందులో పురుషులు 2,068, మహిళలు 221, ఒకరు ట్రాన్స్‌జెండర్ ఉన్నారు."- వికాస్‌రాజ్ , రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
EC Focus on Arrangements of Telangana Polling : రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస సదుపాయాలన్నింటినీ ఏర్పాటు చేస్తున్నారు. దివ్యాంగుల కోసంప్రత్యేక ఏర్పాట్లుచేస్తున్నారు. వారికి రవాణా సదుపాయంతో పాటు ప్రతి చోటా ఉండేలా 21,686 వీల్ ఛైర్లు సిద్ధం చేశారు. 80 ఏళ్లు పైబడిన వారికి కూడా ఉచిత రవాణా సదుపాయం ఉంటుంది. బ్రెయిలీ లిపిలోనూ ఓటరు స్లిప్పులు, నమూనా బ్యాలెట్లు ముద్రించారు. ఓటింగ్ శాతాన్ని పెంచే కసరత్తులో భాగంగా స్థానిక సంస్కృతిని ప్రతిబింబిస్తూ.. 644 మోడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.
Voters in Telangana : 120 కేంద్రాలను దివ్యాంగులు, 597 కేంద్రాలను మహిళలు నిర్వహించనున్నారు. లక్షా 85వేల మంది పోలింగ్ సిబ్బంది.. 22వేల మంది మైక్రో అబ్జర్వర్లు, స్క్వాడ్స్, ఇతరులు మొత్తం కలిపి 2లక్షలకు పైగా పోలింగ్ విధుల్లో ఉండనున్నారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3కోట్ల 26లక్షల 2వేల 799 ఉన్నాయి. వీరిలో పురుషులు కోటి 62లక్షల 98వేల 418 మంది కాగా.. మహిళలు కోటి 63లక్షల 17వంద 5 మంది ఓటర్లున్నారు. ట్రాన్స్‌జెండర్లు ఓటరు జాబితాలో 2వేల 676 మంది ఉన్నారు. సర్వీసు ఓటర్ల సంఖ్య 15వేల 406 కాగా.. ప్రవాస ఓటర్లు 2వేల 944 మంది ఉన్నారు. 18 నుంచి 19 ఏళ్ల వయస్సు వారు 9లక్షల 99వేల 667 మంది ఉన్నారని ఎన్నికల సంఘం వెల్లడించింది.