Telangana State Assembly Elections 2023 Voters List : ఈ సంవత్సరంలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు కసరత్తు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. పోలింగ్ కేంద్రం పరిధిలో గతంలో కన్నా ఓటర్ల సంఖ్య పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. హేతుబద్ధీకరణ ద్వారా.. ఒకే ఇంట్లో ఉన్న ఓటర్లు అందరూ.. ఓటేసేందుకు వేర్వేరు పోలింగ్ కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా చూడాలని రాష్ట్రాలకు సూచించింది. ఇక నుంచి ఒక కేంద్రం పరిధిలో గరిష్ఠంగా 1,500 మంది ఓటర్లు ఉండేలా చూడాలని మార్గదర్శకాలు జారీ చేసినట్లు సమాచారం.
Telangana Voter List : గతంలో ప్రతి పోలింగ్ స్టేషన్‌లో పట్టణాల్లో 1,200 మంది, గ్రామీణ ప్రాంతాల్లో 1,400 మంది ఓటర్లు ఉండేవారు. అంతకు మించితే.. ఆ కేంద్రం పరిధిలో అనుబంధ స్టేషన్ ఏర్పాటు చేసేవారు. ఓటర్ల సంఖ్య పెరుగుతున్నందున కేంద్రాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రతి ఎన్నికల సమయంలో సుమారు రెండు నుంచి మూడు వేల వరకు పోలింగ్ కేంద్రాలు పెరుగుతున్నాయి. కేంద్రాలను పక్కాగా జియోగ్రాఫికల్ మ్యాపింగ్ చేయాలని.. ఈసీ నిర్ణయించింది. ఆ మ్యాపింగ్ చేసే సమయంలో ఇంటి నంబర్లను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఒక ఇంట్లో ఉన్న ఓటర్లు.. ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా చూడాలని ఈసీ సూచించింది.