EC Focus on Telangana Assembly Elections 2023 :రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ( Telangana Assembly Elections) డబ్బు ప్రభావంపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. 2018 ఎన్నికల వేళ కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు భారీగా ఖర్చు చేశారు. పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ భారీగా నగదు, మద్యం, ఇతరత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన హుజూరాబాద్, మునుగోడు ఉపఎన్నికల్లోనూ భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేయడం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
Telangana Assembly Election 2023 : ఈసీ సైతం ప్రత్యేకంగా ఆరా తీసింది. తదుపరి జరిగిన పలు సమావేశాల సందర్భంలోనూ ఎలక్షన్ కమిషన్(Election Commission of India)అధికారులు ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో రానున్న శాసనసభ ఎన్నికల్లోనూ ఎక్కువగా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. విచ్చలవిడి ఎన్నికల వ్యయానికి అడ్డుకట్ట వేసే దిశగా చర్యలు ప్రారంభించింది.
Telangana Assembly Elections 2023 : హైదరాబాద్కు ఈసీ.. అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష
ఖర్చు విపరీతంగా పెట్టే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే జిల్లాల వారీగా.. రెవెన్యూ ఇంటెలిజెన్స్ బృందాలను ఏర్పాటు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని దాదాపు 20 ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలను (Enforcement Agencies)రంగంలోకి దింపారు. ఇప్పటికే ఆయా బృందాలు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాయి. బ్యాంకుల నుంచి ఎక్కువ మొత్తంలో నగదు విత్‌డ్రా చేస్తున్న వారిపై నిఘా పెట్టినట్లు సమాచారం.
గత ఎన్నికల్లో భారీగా నిధులు ఖర్చు చేసిన నియోజకవర్గాలు.. రానున్న ఎన్నికల్లో ఎక్కువ వ్యయం చేసే అవకాశం ఉన్న స్థానాలను గుర్తించే పనిలో అధికారులు పడ్డారు. గత ఎన్నికల తీరు, ప్రస్తుత స్థానిక పరిస్థితులు, పోటీలో ఉండే అభ్యర్థులు.. తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఆ తరహా వాటిని గుర్తించనున్నారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఈసారి రంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ, ఖమ్మంలోని కొన్ని నియోజకవర్గాల్లో భారీగా డబ్బు ఖర్చు చేయవచ్చని అంచనా వేస్తున్నారు.