EC Focus on Social Media in Telangana: రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. క్షణాల్లో వదంతులు సృష్టించి వ్యాప్తిచేసే యూట్యూబర్లపై అధికారులు కన్నేశారు. సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారం పోస్టులు పెడుతూ శాంతియుత వాతావరణానికి భంగం కలిగించే వారిపై నిఘా పెంచారు. రాజకీయ పార్టీల నాయకులు తమ ప్రచార కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. ఈ ప్రచారాలను అణుఅణువునా పరిశీలన చేయడానికి మీడియా మానిటరింగ్ బృందాన్ని ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, పోలీసు సిబ్బంది, సామాజిక మాధ్యమాల నిపుణులు, మీడియా రిపోర్టర్, సీనియర్ సిటిజన్, జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి సభ్యులుగా ఉంటారు.
EC Focus on Youtubers Telangana :ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా ప్రసంగాలు, విమర్శలు, ప్రతి విమర్శలు పోస్ట్‌లు పెట్టిన సంబంధిత వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌కు, పోస్టులు నమోదు చేసిన వ్యక్తికి నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. లంగర్‌హౌస్ పరిధిలో రెండురోజుల క్రితం ఒక యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టు వివాదాస్పదంగా మారింది. ముందుగానే గుర్తించిన పోలీసులు దాన్ని తొలగించారు.
Telangana Election Commission on Social Media Posts : కాలాపత్తర్ ఠాణా పరిధిలో ఒక పాఠశాలపై దాడి ఘటనపై పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పారు. అయినా కొందరు యువకులు కావాలనే రెచ్చగొట్టి ఆదివారం అర్ధరాత్రి దాడికి పాల్పడినట్టు గుర్తించారు. ఈ సంఘటనకు పాల్పడిన 18 మందిపై కేసు నమోదు చేశారు. ఈ దాడికి పాల్పడిన వీడియోలను వాట్సాప్ గ్రూపులో పోస్టు చేసి గుంపును సమీకరించినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
'ప్రధాన మీడియా కంటే సోషల్ మీడియా ప్రభావమే తీవ్రంగా ఉంది'
మీమ్స్ పేరుతో నవ్విస్తున్నామనే ఉద్దేశంతో కొందరు ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు. ఇటీవలె సోషల్ మీడియాలో అధికార, ప్రతిపక్షాలకు చెందిన పలువురి పాత వీడియోలపై మీమ్స్ చేశారు. దీన్ని గమనించిన సైబర్‌క్రైమ్ పోలీసులు మీమ్స్ చేసిన వారిని గుర్తించి కేసులు నమోదు చేశారు. తెలంగాణ, ఏపీలో సుమారు 30 మందికి నోటీసులు జారీ చేశారు.