లోక్సభ ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై అధికారులు దృష్టి సారించారు.రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకు వచ్చే నెల 11న పోలింగ్ జరగనుంది. ఈనెల 18న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పూర్తి స్థాయిలో అమలు చేయాలని అధికారులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆస్తులు, భవనాలు, వెబ్ సైట్లలో రాజకీయ నేతల ఫోటోలను 24 గంటల్లోగా తొలగించాల్సి ఉంటుంది. 72 గంటల్లోగా ప్రైవేట్ ఆస్తులు, భవనాలపై అనుమతి లేకుండా ఉన్న రాజకీయ నేతల ఫోటోలను తీసివేయాలని ఎన్నికల సంఘం సూచించింది. 72 గంటల్లోగా...
కొత్తగా ఎటువంటి అభివృద్ధి పనులను ప్రారంభించడానికి వీలులేదు. ఇప్పటికే ప్రారంభమై కొనసాగుతున్నా.. ఇంకా ప్రారంభించని పనుల వివరాలను 72 గంటల్లోగా అందించాలని కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశించారు. ఫిర్యాదుల స్వీకరణ కోసం కంట్రోల్ రూంలు అందుబాటులో ఉంటాయి. బెంగళూరుకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్, హైదరాబాద్కు చెందిన ఈసీఐఎల్ యంత్రాలను పోలింగ్ కోసం వినియోగించనున్నారు. మరో వెయ్యి యంత్రాల వరకు రాష్ట్రానికి అందాల్సి ఉందని... అవసరమైతే వాటిని విమానాల ద్వారా తరలిస్తామని ఈసీ తెలిపింది.
మొదటి దశ తనిఖీలు
ఈరోజు సాయంత్రంలోగా ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల మొదటి దశ తనిఖీ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నేడు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ సమావేశం కానున్నారు. ఎన్నికల నిర్వహణ, ప్రవర్తనా నియమావళి అమలు, తదితర అంశాలపై చర్చించనున్నారు. రోజూ జిల్లా పాలనాధికారులతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించి ఎన్నికల ఏర్పాట్లను సీఈఓ పర్యవేక్షించనున్నారు. శాంతిభద్రతల కోసం 276 కంపెనీల కేంద్ర బలగాలు కోరగా... ఇప్పటి వరకు 60 కంపెనీల కేంద్ర బలగాలను కేటాయించారు.
ఇవీ చూడండి:ఏప్రిల్ 11 పోలింగ్... మే 23 ఫలితాలు