EC on Telangana Assembly Elections 2023 :తెలంగాణ శాసనసభ ఎన్నికల సన్నాహకాలు ముమ్మరంగా సాగుతున్నాయి. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ధర్మేంద్ర శర్మ నేతృత్వంలోని ఈసీ బృందం హైదరాబాద్‌లో పర్యటిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్, స్పెషల్ పోలీస్, కేంద్ర బలగాల నోడల్ అధికారులతో సమావేశమై.. అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై దిల్లీ నుంచి వచ్చినఈసీ బృందం సభ్యులు ఆరాతీశారు. ఓటర్ల జాబితా, ఈవీఎంలు, అధికారులకు శిక్షణ తదితర అంశాలను సీఈవో వివరించగా.. బందోబస్తు ప్రణాళిక, ఇతరత్రా అంశాలను నోడల్ అధికారులు వివరించారు.
EC Delegation Visits Telangana :2018 ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని.. ఈసారి సమర్థంగా నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ఈసీ బృందం సభ్యులు సూచించారు. బీఎల్ఓల ద్వారా ఇంటింటి పరిశీలన, ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటరు జాబితాలో పేర్లు లేకుండా చూడాలన్నారు. సీబీడీటీ, ఎన్సీబీ, ఎక్సైజ్, జీఎస్టీ, ఈడీ, రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి, డీఆర్‌ఐ, వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో కూడా ఈసీ బృందం సభ్యులు సమావేశమయ్యారు.
EC Team Visits in Hyderabad :ఎన్నికల సమయంలో డబ్బు, ఇతర ప్రలోభాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పూర్తి సమన్వయంతో పనిచేయాలని, పొరుగురాష్ట్రాల సహకారం కూడా తీసుకోవాలని చెప్పారు. సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టు వ్యవస్థ పకడ్బందీగా ఉండాలనిఈసీ బృందం సభ్యులు సూచించారు. గత ఎన్నికల సమయంలో ఎక్కువగా నగదు స్వాధీనం చేసుకున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓటర్ల జాబితా, ఇతర అంశాల ప్రాధాన్యం దృష్ట్యా.. కొంతమంది బీఎల్ఓలతో ఈసీ బృందం సభ్యులు సమావేశమయ్యారు. ఇంటింటి పరిశీలన, ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులపై చర్చించారు. ఇవాళ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ అధికారులతో ఈసీ బృందం సమావేశం కానుంది. జిల్లాల వారీగా ఎన్నికల నిర్వహణ ప్రణాళిక, సన్నాహకాలు, ఏర్పాట్లపై సమీక్షించనున్నారు.