తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆవిరి కుడుములు తింటే ఎంత మంచిదో తెలుసా - steamed dumplings 2022

ఆవిరి కుడుములంటే గణనాథుడికి మహా ఇష్టం. అందుకే వినాయక చవితి రోజున అందరూ మోదకాలు చేసి ఆ పార్వతీ నందనుడికి నివేదిస్తారు. అయితే కేవలం పండగ రోజునే కాదు. నవరాత్రులూ భూమిపై పూజలందుకునే గణేషుడికి రోజుకో నైవేద్యం సమర్పించడం మనకు తెలిసిందే. ఈ క్రమంలో మళ్లీ మళ్లీ మోదకాలు తయారుచేసి గణపతికి నైవేద్యంగా సమర్పించే వారూ చాలామందే. అయితే ఎంతో అమోఘమైన రుచిని నింపుకొన్న ఈ ఆవిరి కుడుములు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా చేకూర్చుతాయంటున్నారు పోషకాహార నిపుణులు. మరి, మోదక ప్రియుడికి నివేదన చేసే ఈ ఆవిరి కుడుముల్లో దాగున్న ఆరోగ్య రహస్యాలేంటో మనమూ తెలుసుకుందాం రండి.

steamed dumplings 2022
ఆవిరి కుడుములు తింటే ఎంత మంచిదో తెలుసా

By

Published : Sep 1, 2022, 7:30 AM IST

కుడుములు.. ఎవరికి, ఎంత మంచివి?

సాధారణంగా ఆవిరి కుడుములంటే బియ్యప్పిండితో తయారుచేస్తాం. అందులో స్టఫింగ్ కోసం కొబ్బరి తురుము, బెల్లం, నెయ్యి.. వంటివి వాడతాం. గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ మోదకాలను తప్పకుండా తినాల్సిందేనట.

  • మోదకాల తయారీలో వాడే నెయ్యి పేగు శ్లేష్మ పొరను పునర్నిర్మిస్తుంది. తద్వారా పొట్టలోని విషపదార్థాలు సులభంగా బయటికి వెళ్లిపోయి మలబద్ధకం సమస్య నుంచి విముక్తి పొందచ్చు.
  • కొబ్బరిలోని మీడియం చెయిన్ ట్రై-గ్లిజరైడ్స్ రక్తప్రసరణను అదుపులో ఉంచడంలో సహకరిస్తాయి. తద్వారా గుండె పదిలంగా ఉంటుంది.
  • కొబ్బరిలోని ప్లాంట్ స్టెరాల్స్, స్టఫింగ్ కోసం ఉపయోగించే డ్రైఫ్రూట్స్.. వంటివి శరీరంలోని చెడు కొవ్వును తగ్గించి.. మంచి కొవ్వును పెంచుతాయి. ఫలితంగా బరువు అదుపులో ఉంటుంది.
  • బియ్యప్పిండి, కొబ్బరి, బెల్లంతో తయారుచేసిన కుడుముల్ని ఆవిరిపై ఉడికించి, నెయ్యిలో నంజుకొని తింటే ఆ రుచి అమోఘం. అయితే ఈ పదార్థాలన్నీ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌ని కలిగి ఉంటాయి.. కాబట్టి పూర్తి సురక్షితం. మధుమేహంతో బాధపడే వారికైతే ఇవి మరీ మంచివి. ఎందుకంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయుల్ని స్థిరంగా ఉంచడంలో తోడ్పడతాయి.
  • నెయ్యిలోని బ్యుటిరికామ్లం శరీర కణజాలాల్లోని వాపును తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా కీళ్ల వాపును తగ్గించి ఆర్థ్రైటిస్ సమస్యను దూరం చేస్తుంది.
  • నెలసరికి ముందు మహిళల్లో ఆహారపు కోరికలు (పీఎంఎస్) ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ సమయంలో హార్మోన్లలో మార్పుల వల్ల రక్తంలో చక్కెర స్థాయులు పడిపోతాయి. తద్వారా తీపి తినాలన్న కోరిక పెరుగుతుంది. ఈ కోరికల్ని తగ్గించడంలో బియ్యంలోని విటమిన్ ‘బి1’ సహకరిస్తుంది. అలాగే బియ్యప్పిండి రక్తంలోని చక్కెరను స్థిరంగా ఉంచడంలో తోడ్పడుతుంది.
  • వయసు పైబడిన ఛాయల్ని రూపుమాపి.. నవయవ్వనంగా కనిపించేందుకు, థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరిచేందుకు ఈ రుచికరమైన కుడుములకు సాటి మరొకటి లేదు.
  • బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నారా? అయితే కుడుములు అందుకు సహకరిస్తాయి. వీటి తయారీకి వాడిన పదార్థాలన్నీ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌ని కలిగి ఉంటాయి. మంచి కొవ్వులు, పోషక విలువల్ని నింపుకొన్న ఈ మోదకాలను వద్దనడానికి కారణమే లేదు. అలాగే శారీరక, మానసిక ఆరోగ్యానికి.. దృఢత్వానికీ ఈ వంటకం చక్కగా ఉపయోగపడుతుంది- అంటున్నారు పోషకాహార నిపుణులు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details