ఈటల రాజేందర్ తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసేందుకు శామీర్‌పేటలోని తన నివాసం నుంచి అసెంబ్లీ ముందు ఉన్న గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వరకు భారీ ర్యాలీగా తరలివచ్చారు. అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన ఈటల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని అమరవీరుల సాక్షిగా ప్రకటించారు. హుజురాబాద్ నియెజకవర్గ ప్రజలు ఓటమి ఎరగకుండా 14 ఏళ్లుగా తనను ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు. అనేకమంది ఇతర పార్టీల్లో గెలిచి రాజీనామా చేయకుండా తెరాసలో చేరి మంత్రులుగా నిస్సిగ్గుగా కొననసాగుతున్నారని విమర్శించారు. హుజరాబాద్‌లో ఎన్నిక యావత్ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కుటుంబానికి మధ్య జరగబోతుందన్నారు. హుజురాబాద్ ప్రజలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బాహుటా ఎగురవేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎట్లా గెలవాలని సమీక్షలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమకారులంతా హుజురాబాద్‌కు కదిలిరావాలని పిలుపునిచ్చారు.
ఈటల రాజీనామాకు ఆమోదం
అమరవీరుల స్థూపం వద్ధ నివాళులు అర్పించిన అనంతరం అక్కడి నుంచి నేరుగా అసెంబ్లీకి వెళ్లారు. శాసనసభాపతి కార్యాలయంలో అసెంబ్లీ సెక్రటరీకి తన రాజీనామా లేఖను అందజేశారు. స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖ ఇవ్వాలని భావించినప్పటికీ కొవిడ్‌ను అడ్డంపెట్టుకుని ఆయన కూడా సమయం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనివార్య పరిస్థితుల్లో రాజీనామా లేఖను అసెంబ్లీ సెక్రటరీకి అందజేసినట్లు తెలిపారు. అనంతరం మాజీ మంత్రి ఈటల రాజేందర్ శాసనసభ్యత్వానికి చేసిన రాజీనామా ఆమోదం పొందింది. రాజేందర్ రాజీనామా లేఖను పరిశీలించిన శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి దానికి ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. సభాపతి నిర్ణయానికి అనుగుణంగా శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇవాళ్టి తేదీ నుంచి రాజీనామా అమల్లోకి వచ్చినట్లు అందులో పేర్కొన్నారు. రాజీనామాతో హుజూరాబాద్ శాసనసభ స్థానం ఖాళీ అయినట్లు గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. హుజూరాబాద్ స్థానం ఖాళీ అయినట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు.
హుజూరాబాద్‌లో పాదయాత్ర చేస్తా..