Reading Tips for Students: అంతగా ఆసక్తి లేని పని మొదలుపెట్టాలంటే.. మనసు ఒక పట్టాన ఒప్పుకోదు. నచ్చని సబ్జెక్టుల విషయంలోనూ ఇలాగే జరుగుతుంటుంది. ఇలాంటప్పుడే ‘5 మినిట్ రూల్’ని అమలుచేయాలంటున్నారు నిపుణులు. దీంట్లో భాగంగా ఏదైనా కొత్త పనిని మొదలుపెట్టి ఐదు నిమిషాలపాటు మాత్రమే చేయాలి. సరిగ్గా 5 నిమిషాలకు అలారం పెట్టుకుని.. కాస్త కఠినంగా ఉండే సబ్జెక్టును చదవడం మొదలుపెట్టాలి.
సమయం ముగిసినా.. ఆ సబ్జెక్టును ఇంకా చదవాలనిపిస్తే మరో పావుగంటపాటు కొనసాగించొచ్చు. తర్వాత ఆ సబ్జెక్టును పక్కన పెట్టేయాలి. మరో ఐదు నిమిషాలు అలారం పెట్టుకుని కొత్త సబ్జెక్టును చదవాలి. ఇలా చేయడం వల్ల చదవడాన్ని వాయిదా వేయకుండా ఉండగలుగుతారు. ఏ సబ్జెక్టు చదవాలని అనిపిస్తుందో.. దాన్ని ఆసక్తిగా కొనసాగించగలుగుతారు.
ఒకే సబ్జెక్టు వద్దు:ఒకే సబ్జెక్టును గంటలకొద్దీ చదువుతూ ఉండకూడదు. ప్రతి అరగంటకు ఒకసారైనా కాస్త విరామం తీసుకోవాలి. ఆ సమయంలో ఒకేచోట కూర్చుని ఉండకుండా.. కాస్త అటూఇటూ నడవాలి. ఇలాచేయడం వల్ల బద్ధకం వదిలి చురుకుదనం పెరుగుతుంది. ఇలా ఒక్కో సబ్జెక్టుకూ తక్కువ సమయాన్ని కేటాయించడం వల్ల విసుగు అనిపించదు.
చాలా రకాలుగా:సాధారణంగా తరగతి పుస్తకంలోని పాఠ్యాంశాలనే చదువుతుంటాం కదా. అలాకాకుండా మరో విధానమూ ప్రయత్నించాలి. ఆ పాఠానికి సంబంధించిన ఆడియో వినొచ్చు లేదా యూట్యూబ్‌లో వీడియో చూడొచ్చు. పాత ప్రశ్నపత్రాలనూ పూర్తిచేయొచ్చు. ఆ పాఠంలోని ముఖ్యాంశాలను ప్రశ్నించమని స్నేహితులను అడగొచ్చు. మీరూ వాళ్లకు కొన్ని ప్రశ్నలు వేయొచ్చు. ఇలా ఒకరినొకరు ప్రశ్నించుకోవడం ఆసక్తిగా ఉంటుంది. అంతేకాదు, సరైన సమాధానాలు చెప్పాలనే పోటీ మీ మధ్య పెరుగుతుంది కూడా. అలాగే గణాంకేలేమైనా ఉంటే ఫ్లాష్ కార్డులనూ తయారుచేసుకుని వాడుకోవచ్చు. ఇలా వివిధ పద్ధతుల్లో పాఠ్యాంశాలను చదివితే ఆసక్తిగా ఉంటుంది. త్వరగా మర్చిపోలేరు కూడా.
చదువుకునే ప్రదేశం: చదువుకునే చోటు ప్రశాంతంగా.. గాలీ, వెలుతురూ వచ్చేలా ఉండాలి. ఎలాంటి అవాంతరాలూ లేకుండా చూసుకుంటే దృష్టి అనవసర విషయాల మీదకు మళ్లదు. చదవడానికి సంబంధించిన సామగ్రి అంతటినీ ఒకేచోట అందుబాటులో పెట్టుకోవాలి. ఎక్కో వస్తువు కోసం ఒక్కోసారి లేచి వెళితే ఏకాగ్రత లోపిస్తుంది.