తెలంగాణ

telangana

By

Published : Jul 29, 2020, 10:39 PM IST

ETV Bharat / state

మానవతా బంధాలను తుంచేస్తున్న కరోనా..

తూర్పుగోదావరి జిల్లాలో రోజురోజూకూ కరోనా విజృంభిస్తోంది. కొవిడ్ కేసులు 15వేలు దాటాయి. 134 మంది మహమ్మారితో మరణించారు. కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురంలో రోజూ గరిష్ఠ కేసులు నమోదవుతున్నాయి.

east-godavari-corona-cases
మానవతా బంధాలను తుంచేస్తున్న కరోనా..

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల తీవ్రత పెరుగుతోంది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు నమోదైన కేసుల వివరాలతో కొవిడ్‌-19 విభాగం విడుదల చేసిన బులెటిన్​లో తాజాగా 1,367 పాజిటివ్‌ కేసులు వచ్చినట్లు పేర్కొన్నారు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు 15,841 మందికి వైరస్‌ సోకినట్లు పేర్కొన్నారు. అధికంగా కాకినాడ నగరంలో 338, కాకినాడ గ్రామీణం మండలంలో 90, రాజమహేంద్రవరం నగరంలో 203, రాజమహేంద్రవరం గ్రామీణ మండలంలో 67, అమలాపురంలో 55 చొప్పున గరిష్ఠంగా కేసులు నమోదయ్యాయి.

  • జులై నుంచే వ్యాప్తి..

జిల్లాలో తొలికేసు నమోదైన మార్చి 21 నుంచి ఇప్పటి వరకు (128 రోజుల్లో) 15,841 కేసులు వెలుగు చూశాయి. జూన్‌ నెల చివరి వరకు తక్కువ సంఖ్యలోనే కేసులు వచ్చినా.. ఈ నెల ప్రారంభం నుంచి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. ప్రత్యేకంగా ఈనెల 16 దాటిన తర్వాత 20, 21, 22, 26 మినహా మిగిలిన తేదీల్లో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. జూన్‌ నుంచి పలు రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరగటం వల్ల కేసుల సంఖ్య కూడా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

  • 134కు చేరిన మరణాలు..

జిల్లాలో ఇప్పటి వరకు 134 మంది కరోనాతో మృతి చెందినట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కొవిడ్‌-19 బులెటిన్​లో పేర్కొంది. గత 24 గంటల్లో జిల్లాలో అయిదుగురు మృతి చెందినట్లు వెల్లడించారు. అమలాపురం కిమ్స్‌ ఆసుపత్రిలో రాజమహేంద్రవరానికి చెందిన ఇద్దరు, హైదరాబాద్‌ వాసి ఒకరు మృతి చెందారు. మండపేటలో ఒకరు, ప్రత్తిపాడులో విశ్రాంత ఉపాధ్యాయిని, పెద్దాపురంలోని నువ్వుల వీధిలో ఒకరు, కరప మండలం పెనుకుదురు మహిళ, ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మృతిచెందారు.

  • నలుగురు గర్భిణులకు పాజిటివ్‌

రావులపాలెం పట్టణం ఊబలంక పీహెచ్‌సీ వద్ద 24 మంది గర్భిణులకు కరోనా పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు పీహెచ్‌సీ వైదాధికారి దుర్గాప్రసాద్‌ తెలిపారు. రావులపాలెంలో రెండు, వెదిరేశ్వరంలో ఒకటి, మెర్లపాలెంలో ఒకటి వచ్చాయన్నారు.

  • భర్త ఇక లేడని...

అమలాపురం సమతానగర్‌లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. కరోనా బారినపడి ఓ వ్యక్తి(64) సోమవారం మృతి చెందారు. ఈ విషయం తెలిసి ఆయన భార్య(61) మంగళవారం మరణించారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక కుమారుడు. భర్త మృతితో కన్నీరుమున్నీరుగా విలపించటం వల్ల తీవ్ర ఆయాసానికి గురైన ఆమెను ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చింది. పరిస్థితి విషమించటం వల్ల కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా అక్కడ మరణించారు.

  • తల్లిడిల్లిన హృదయం.. అంతులేని విషాదం

కరోనా మహమ్మారి బారినపడి ఒక రోజు వ్యవధిలో తనయుడు, తల్లి మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. గోకవరానికి చెందిన ఓ వ్యక్తికి (49) కరోనా సోకగా రాజానగరంలోని జీఎస్‌ఎల్‌ కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 26న రాత్రి మృతి చెందాడు. ఆయన మృతితో కుటుంబం విషాదంలో మునిగింది. సోమవారం అతని తల్లికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్న ఆమె మంగళవారం ఉదయం మృతి చెందారు.

  • బంధం.. కనుమరుగు

పెద్దాపురం కాండ్రకోట గ్రామ వృద్ధుడు(80)కి సోమవారం పాజిటివ్‌ అని తేలింది. అతడికి మంగళవారం ఆయాసం రావటం వల్ల 108కు ఫోన్‌ చేశారు. వాహనంలో ఆసుపత్రికి తరలించడానికి రోగితోపాటు మరొకరికి పీహెచ్‌సీ సిబ్బంది పీపీఈ కిట్లు ఇచ్చారు. లోపల నుంచి బాధితుడిని తీసుకొస్తే తరలిస్తామని అంబులెన్స్‌ సిబ్బంది చెప్పారు. కుటుంబ సభ్యులు సహకరించకపోవటం వల్ల వారు వెళ్లిపోయారు. తర్వాత ఉదయం 11 గంటలకు ఇంట్లోనే వృద్ధుడు మృతిచెందాడు. అటు బంధువులు, ఇటు అధికారులు స్పందికపోవడం వలన ఉదయం నుంచి రాత్రి వరకు మృతదేహం అలా ఇంట్లోనే పడి ఉంది. ఎట్టకేలకు రాత్రికి అధికారులు స్పందించి ప్రైవేటు అంబులెన్స్‌, మనుషులను ఏర్పాటు చేసుకోమని గ్రామ కార్యదర్శి ద్వారా సూచించారు. ఈలోగా వృద్ధుడి తమ్ముడి కుమారుడు కాకినాడలో ఉన్న బంధువుల ద్వారా ప్రైవేటు అంబులెన్స్‌ను కొందరు వ్యక్తులను రప్పించి రాత్రి 8 గంటలు దాటిన తర్వాత మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

ఇవీ చూడండి: కరోనాతో ఆర్టీసీకి తగ్గిన ఆదాయం.. పార్శిల్​పైనే ఆశలు

ABOUT THE AUTHOR

...view details