Gongadi wool shoes for Farmers :సాధారణంగా బూట్ల ప్రకటనలు అంటే అథ్లెటిక్స్ కోసమే అన్నట్లు చూపిస్తారు. అలాగే తయారు చేస్తారు కూడా. కానీ ఎప్పుడు కాలినడకనే నడిచే రైతుల గురించి మరి. ఇదే ఆలోచనతో ముందుకు సాగారు ఈ యువకులు. అనేక అధ్యయనాల తర్వాత.. రైతుల కోసం గొంగడితో చేసే ప్రత్యేకమైన బూట్లు రూపొందించారు. అందరి మన్ననలు, ప్రశంసలు అందుకుంటున్నారు.
Hyderabad Students Made Shoes For Farmers : ఈ యువకుల పేర్లు సంతోశ్, నకుల్, విద్యాధర్. మొదట ఒకరికి ఒకరు పెద్దగా తెలియదు. వీరందరి చిన్నప్పటి కల ఒక్కటే. అదే కార్లు, బైకులపై ఇష్టం. ఆ ఇష్టంతో ఇంజినీరింగ్ చేయాలి అనుకున్నారు. హైదరాబాద్ బిట్స్ పిలానీలో ఇంజినీరింగ్ చేస్తూ కలుసుకున్నారు. ఆ సమయంలో అధ్యాపకులు ఇచ్చిన ఓ ప్రాజెక్టు పని కోసం పొలం బాటపట్టారు వీరి బృందం.
ఈ ముగ్గురి కుటుంబాలతో ఏమాత్రం వ్యవసాయ నేపథ్యం లేదు. ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా కష్టజీవులైన రైతులు పొలంలో పడుతున్న కష్టాలు చూసి చలించారు. రైతులు పడుతున్న 30కి పైగా సమస్యలను గుర్తించారు. అందులో 5 ప్రధానమైనవని తెలుసుకున్నారు. రైతులు కాళ్లకు ఏం లేకుండా వ్యవసాయ పనులు చేయడం అందులో ఒకటని చెబుతున్నారు ఈ ముగ్గురు.
గొంగడిపై పరిశోధన.. రైతులకు పొలంలో బూట్లు : తాము గుర్తించిన రైతన్నల సమస్యలపై అధ్యయనం చేయాలనుకున్న వీరికి కళాశాల నుంచి కూడా ప్రోత్సాహం లభించింది. దాంతో వివిధ ప్రదేశాలను, రాష్ట్రాలను సందర్శించి.. అక్కడి రైతులతో మమేకమయ్యారు. అప్పుడే గొంగడి గురించి తెలిసింది. ఇదేదో బాగుందే అంటూ గొంగడిపై పరిశోధన చేశారు. ఆ పరిశోధనలో దాన్ని పూర్తి ప్రత్యేకతలు అర్థం చేసుకున్నారు.
"మాకు తెలుసు ఈ ప్రపంచంలో అమ్మ తర్వాత అన్నం పెట్టేది అన్నదాతే అని. అలాంటి రైతు పంట పండించడానికి ఎన్నో కష్టాలు పడుతున్నాడు. మేం ఇంట్లో కూర్చొని వాళ్ల కష్టాల గురించి మాట్లాడితే లాభం లేదని తెలుసు. అందుకే వాళ్ల దగ్గరికే వెళ్లాలని నిశ్చయించుకున్నాం. అందుకే వారి వద్దకు వెళ్లి రైతులు పడుతున్న కష్టాలు కళ్లారా చూశాం. వారి సమస్యలను గుర్తించాం. అందులో ప్రధానంగా ఐదు సమస్యలను పరిగణనలోకి తీసుకున్నాం." -సంతోశ్ కొంచెర్లకోట, ఎర్తెన్ ట్యూన్ వ్యవస్థాపకుడు