Eamcet Exam Today in Telangana : ఇంటర్మీడియెట్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉన్నత విద్యా ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ పరీక్షకు సర్వం సన్నద్ధమైంది. ఇవాళ, రేపు బైపీసీ అభ్యర్థులకు వ్యవసాయ, ఫార్మా కోర్సుల కోసం పరీక్ష జరగనుంది. ఈ నెల 12 నుంచి 14 వరకు ఇంజినీరింగ్ ఎంసెట్ ఉంటుంది. వరుసగా ఐదు రోజుల పాటు రెండు పూటల పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.
ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరిగే మొదటి సెషన్‌కు ఉదయం ఏడున్నర నుంచే అనుమతించనున్నారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు జరిగే రెండో సెషన్‌కు ఒకటిన్నర నుంచి పరీక్ష కేంద్రాల్లోకి పంపనున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాయనివ్వమని అధికారులు స్పష్టం చేశారు. నిర్ణీత సమయానికి చేరుకునేలా విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్త వహించాలని సూచించారు.
ఈ ఏడాది ఎంసెట్‌కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు అందాయి. ఇంజినీరింగ్ కోసం 2 లక్షల 53 వేల 935 అభ్యర్థనలు రాగా అందులో 51 వేల 470 మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులున్నట్లు తెలిపారు. ఫార్మా, వ్యవసాయ కోర్సులకు లక్షా 15 వేల 361 దరఖాస్తులు రాగా.. 20 వేల 747 మంది ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులున్నట్లు వెల్లడించారు. పెరిగిన అభ్యర్థులకనుగుణంగా రాష్ట్రంలో 104, ఎపీలో 33 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ఈ ఏడాది ఫ్లైయింగ్ స్క్వాగ్‌లకు బదులు అన్ని పరీక్ష కేంద్రాల్లో పరిశీలకులను నియమించినట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు.