రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మా, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇవాళ నుంచే ఎంసెట్ ప్రారంభం కానుంది. నేడు, రేపు, ఎల్లుండి ఇంజినీరింగ్ విభాగానికి ఈనెల 9, 10 తేదీల్లో వ్యవసాయ, ఫార్మా కోర్సులకు ఎంసెట్ నిర్వహించనున్నారు. రోజూ రెండు పూటలు పరీక్ష ఉంటుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు రెండో పూట మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు పరీక్ష జరగనుంది. ఇంజినీరింగ్‌కు లక్ష 64 వేల 962 మంది.. ఫార్మా, వ్యవసాయ కోర్సుల కోసం 86 వేల 644 అభ్యర్థులు కలిపి రికార్డు స్థాయిలో 2 లక్షల 51 వేల 606 మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ 82... ఏపీలో 23 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది.
రెండు గంటల ముందు నుంచే అనుమతి
పరీక్ష ప్రారంభానికి రెండు గంటల ముందు నుంచే కేంద్రాల్లోకి వెళ్లవచ్చునని..ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్దన్ స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కొవిడ్ జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలన్నారు. కరోనా పాజిటివ్ ఉన్న ఎంసెట్ అభ్యర్థులకు చివరి సెషన్లో పరీక్ష నిర్వహిస్తామని.. అప్పటికీ కోలుకోక పోతే ఉన్నతాధికారులతో చర్చించి తర్వాత తగిన ఏర్పాట్లు చేస్తామని కన్వీనర్ వెల్లడించారు. కరోనా లక్షణాలు లేవని విద్యార్థులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కరోనా తీవ్రత కారణంగా ఈ ఏడాది అభ్యర్థుల వేలిముద్రలు, బయోమెట్రిక్ వివరాలను సేకరించబోమని కన్వీనర్ తెలిపారు. హాల్ టికెట్‌పై గెజిటెడ్ లేదా కాలేజీ ప్రిన్సిపల్ సంతకం తప్పనిసరి కాదని కన్వీనర్ గోవర్దన్ తెలిపారు. మొబైల్ ఫోన్లు, కాలిక్యులేటర్, గడియారం పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఉండదని కన్వీనర్ స్పష్టం చేశారు. పరీక్ష పూర్తయిన 15 రోజుల్లో ఫలితాలు వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి: