Eamcet Engineering Exam: రాష్ట్రంలో ఎంసెట్ రెండో సెషన్ ప్రారంభమైంది. ఉదయం మొదటి సెషన్లో రాష్ట్రంలోని 89 పరీక్ష కేంద్రాల్లో 95.46 శాతం మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. ఏపీలోని 19 కేంద్రాల్లో 77.3 శాతం హాజరు నమోదైంది. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి, జేఎన్టీయూహెచ్ వీసీ కట్టా నర్సింహారెడ్డి, కన్వీనర్ గోవర్దన్ ఉదయం పలు కేంద్రాల్లో ఎంసెట్‌ను పర్యవేక్షించారు.
వరంగల్‌లోని గణపతి ఇంజినీరింగ్ కళాశాలలో రెండో సెషన్ 40 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. నగరంలో విద్యుత్ అంతరాయం కలగడంతో 40 నిమిషాలు ఆలస్యంగా పరీక్షను ప్రారంభించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. చివరకు ప్రత్యేక జనరేటర్ తీసుకువచ్చి విద్యుత్ అంతరాయం తొలగించామన్నారు. విద్యార్థులకు అదనంగా 40 నిమిషాలు కేటాయించినట్లు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఇవాళ, రేపు, ఎల్లుండి ఇంజినీరింగ్ విభాగం పరీక్ష జరగనుంది. రోజూ రెండు పూటలా పరీక్ష నిర్వహిస్తుండగా.. ఒక్కో సెషన్‌కు సుమారు 29 వేల మంది హాజరుకానున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు... రెండోపూట పరీక్ష మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఇంజినీరింగ్‌కు లక్షా 72 వేల 241 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో 89, ఏపీలో 19 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. వాయిదాపడిన అగ్రికల్చర్, ఫార్మా విభాగం పరీక్ష తేదీలను ఉన్నత విద్యామండలి త్వరలో ఖరారు చేయనుంది.