తెలంగాణలో ఎంసెట్, ఈసెట్ షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 19న ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది. ఈనెల 21 నుంచి మార్చి 30 వరకు.. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరిస్తారు. ఏప్రిల్ 27 వరకూ పదివేల ఆలస్య రుసుముతో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు దరఖాస్తులో సవరణలకు అవకాశం ఇవ్వనున్నారు. ఏప్రిల్ 20 నుంచి మే 1 వరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మే 4, 5, 7 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష, మే 9,11 తేదీల్లో వ్యవసాయం, వైద్య పరీక్ష నిర్వహించనున్నారు.
తెలంగాణలో 51, ఏపీలో 4...
తెలంగాణలో 51, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు పరీక్ష కేంద్రాల్లో ఎంసెట్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, తిరుపతిలో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. ఈ ఏడాది ఎస్సీ, ఎస్టీలతో పాటు దివ్యాంగులకు కూడా పరీక్ష రుసుములో రాయితీ ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఎంసెట్‌కు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 400 రూపాయలు... బీసీ, ఓసీలు 800 రూపాయలు చెల్లించాలి.
నిమిషం నిబంధనలో మార్పు లేదు
ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి నిరాకరించే నిబంధనలో ఎలాంటి మార్పు లేదని.. కచ్చితంగా అమలు చేస్తామని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి స్పష్టం చేశారు. ఈడబ్ల్యూఎస్ కోటా అమలు కోసం ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అనుమతి రాలేదని.. అయితే ముందు జాగ్రత్తగా దరఖాస్తులో మాత్రం ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ ఇస్తున్నట్లు తెలిపారు.