ఇవాళ్టి నుంచి ఏపీలో ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. 29 నుంచి 31 వరకు పాలిటెక్నిక్ కళాశాల, విజయవాడ మినహా మిగతా అన్ని కేంద్రాల్లోనూ ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావచ్చు. దివ్యాంగులు, ఎన్‌సీసీ, క్రీడలు, మాజీ సైనికోద్యోగుల పిల్లలు 29వ తేదీ విజయవాడలోని పాలిటెక్నిక్ కళాశాలలోఉన్న సహాయ కేంద్రంలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలి. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 25 సహాయ కేంద్రాలు జనవరి 1 వరకు పని చేస్తాయని కన్వీనర్ ఎం.ఎం.నాయక్ వెల్లడించారు. ఎంసెట్ కౌన్సెలింగ్‌కు అక్టోబరు 23న తొలుత నోటిఫికేషన్ జారీచేశారు. అప్పుడు 85,702 మంది ప్రాసెసింగ్ రుసుము చెల్లించి, ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసుకున్నారు. మొదటి నోటిఫికేషన్‌లో కౌన్సెలింగ్‌కు హాజరుకాని వారికి ఈసారి అవకాశం కల్పించారు.
కోర్సుల ఎంపిక ఇలా..
ప్రాసెసింగ్ రుసుము చెల్లింపు, ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసుకున్న విద్యార్థులు సోమవారం నుంచి కళాశాలలు, కోర్సుల ఎంపికకు ఐచ్ఛికాలు నమోదు చేసుకోవచ్చు. జనవరి 1న కొత్తగా ఐచ్ఛికాల నమోదు, మార్పులు చేసుకునే అవకాశం కల్పించారు. 3న సీట్ల కేటాయింపు పూర్తి చేస్తారు. వివరాలను సాయంత్రం 6 గంటలకు వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు. విద్యార్థులు ఫోన్ నంబరు, లాగిన్ ఐడీ, రిజిస్ట్రేషన్ నంబర్లలో మార్పులు చేసుకోవాలంటే సహాయ కేంద్రాలను సంప్రదించాలి. సందేహాలుంటే 81068 76345, 81065 75234, 79958 65456, 79956 81678 నంబర్లలో సంప్రదించవచ్చు.
కన్వీనర్ కోటాలో 91,875 సీట్లు
రాష్ట్రంలో 257 ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో మొత్తం 1,29,016 సీట్లున్నాయి. ఇందులో కన్వీనర్ కోటావి 91,875, యాజమాన్య కోటా సీట్లు 37,141. వీటికి అదనంగా ఈడబ్ల్యూఎస్ కోటాలో 10 శాతం సీట్లు ఉంటాయి. వర్సిటీ కళాశాలల్లో 5,212 సీట్లు ఉన్నాయి. 120 బీఫార్మసీ కళాశాలల్లో 10,675 సీట్లకు ఉన్నత విద్యా శాఖ అనుమతిచ్చింది. విశ్వవిద్యాలయాల్లో 9 బీఫార్మసీ కళాశాలల్లో 520 సీట్లున్నాయి