Telangana EAMCET Counselling From Today : రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. అందుకోసం ఇవాళ్టి నుంచి జులై 5 వరకు ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్ ఫీజు చెల్లించి.. ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న కేంద్రాల్లో ఈ నెల 28 నుంచి జులై 6 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఈ నెల 28 నుంచి జులై 8 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. జులై 12న మొదటి విడత ఇంజినీరింగ్ సీట్లు కేటాయిస్తారు. సీటు వచ్చిన అభ్యర్థులు జులై 12 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
EAMCET Counselling Dates 2023 :జులై 21 నుంచి 24 వరకు రెండో విడత ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ జరుగుతుంది. జులై 28న రెండో విడత ఇంజినీరింగ్ సీట్లు కేటాయిస్తారు. ఆగస్ట్ 2న తుది విడత ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఆగస్టు 2 నుంచి 4 వరకు తుది విడత వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవాలి. ఆగస్టు 7న ఇంజినీరింగ్ తుది విడత సీట్లు కేటాయిస్తారు. ఆగస్టు 7 నుంచి 9 వరకు కాలేజీల్లో చేరేందుకు గడువు ఉంటుంది. ఆగస్టు 8న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల చేస్తారు.
EAMCET Counselling Dates 2023 TS : ఈ నెల 28 నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కావలసి ఉండగా.. ఇప్పటి వరకు ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయో తేలలేదు. జేఎన్టీయూహెచ్, ఓయూ ఇంజినీరింగ్ కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయలేదు. రేపు సాయంత్రం వరకు కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది సుమారు లక్ష ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.