అందివచ్చిన సాంకేతికత వికృత రూపం దాలుస్తూ... తత్కాల్ టిక్కెట్లను సామాన్యుడికి దూరం చేస్తోంది. అక్రమాలకు అలవాటు పడ్డ కొందరు టిక్కెట్ ఏజెంట్లు... కొత్త సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నారు. ఈ టిక్కెట్లను తీసి అధిక ధరలకు విక్రయించిన ఘటనలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. ఏపీ రైల్వే రక్షక దళం దీనిపై మరింత లోతుగా విచారించిన తర్వాత అతి పెద్ద రాకెట్ వెలుగులోకి వచ్చింది. ఎ.ఎన్.ఎం.ఎస్ అనే సాఫ్ట్వేర్ ద్వారా ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి... తత్కాల్లో వేగంగా ఈ-టిక్కెట్లను తీసుకుంటున్న లోగుట్టును విశాఖ రైల్వే రక్షక దళం కనుగొంది.
దాదాపు 14.83 లక్షల రూపాయల విలువైన టిక్కెట్లను ఒక్క రోజే తీసుకున్నట్టు ఆర్పీఎఫ్ ప్రత్యేక బృందం గుర్తించడం... ఈ దోపిడీ తీవ్రతకు అద్దంపడుతోంది. విశాఖ పారిశ్రామిక ప్రాంతమైన దువ్వాడలోని ఎస్పీ టూర్స్అండ్ ట్రావెల్స్‌ను నడుపుతున్న కటక్ వాసి సమీర్ కుమార్ ప్రధాన్... ఒక ప్రత్యేకసాఫ్ట్వేర్తో ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేయడం విస్మయానికి గురిచేస్తోంది. కొన్ని సెకన్లలోనే వందల సంఖ్యలో తత్కాల్ టిక్కెట్లను నకిలీ ఐడీల ద్వారా తీసుకోవడం... వాటితో ఒక్కో ప్రయాణికుడి వద్ద మూడు నుంచి నాలుగు వందల రూపాయలు వసూలు చేస్తున్నట్టు ఆర్పీఎఫ్ గుర్తించింది.